Begin typing your search above and press return to search.

ఆ ఎమ్మెల్యే చూపు టీడీపీ వైపు ఉందా?

By:  Tupaki Desk   |   24 Aug 2022 8:35 AM GMT
ఆ ఎమ్మెల్యే చూపు టీడీపీ వైపు ఉందా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్సార్సీపీ అత్యంత బ‌లంగా ఉన్న జిల్లాల్లో నెల్లూరు జిల్లా ఒక‌టి. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరు జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల‌ను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. కాగా ప్ర‌స్తుతం అదే జిల్లాలో వెంక‌ట‌గిరి నుంచి ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రాష్ట్రంలోనే రాజ‌కీయంగా ప్ర‌త్యేక‌త క‌లిగిన కుటుంబాల్లో ఆనం కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి గ‌తంలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ప‌లుమార్లు గెలిచారు. ఆ త‌ర్వాత ఆయ‌న అనారోగ్యంతో క‌న్నుమూశారు.

కాగా ఆనంరామ‌నారాయ‌ణ‌రెడ్డి 2004, 2009లో వైఎస్సార్ ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు, త‌ర్వాత ఆయ‌న మ‌ర‌ణించాక రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్‌రెడ్డి మంత్రివ‌ర్గాల్లో ఆర్థికం వంటి కీల‌క శాఖ‌ల‌కు మంత్రిగా చ‌క్రం తిప్పారు. ఒకానొక ద‌శ‌లో ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి కూడా ఆయ‌న పేరు వినిపించింది. ఆ స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ కాంగ్రెస్ నుంచి వేరుప‌డి వేరే పార్టీ ఏర్పాటు చేసిన‌ప్పుడు జ‌గ‌న్‌పై ఘాటు విమ‌ర్శ‌లు చేసిన‌వారిలో ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి ఒక‌రు. అయితే మారిన ప‌రిస్థితుల్లో 2019 ఎన్నిక‌ల ముందు వైఎస్సార్సీపీలో చేరిన ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి వెంక‌ట‌గిరి నుంచి గెలుపొందారు.

అయితే ఆయ‌న‌కు వైఎస్సార్సీపీలో ఎలాంటి ప్రాధాన్య‌త ల‌భించ‌లేద‌నే అసంతృప్తి ఉంద‌ని అంటారు. ఆయ‌న సీనియారిటీని గుర్తించి జ‌గ‌న్ త‌గిన ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ఆనం అనుచ‌రుల్లోనూ అసంతృప్తి ఉంద‌ని అంటుంటారు. ఈ నేప‌థ్యంలో మే నెల చివ‌ర‌లో టీడీపీ మ‌హానాడు సంద‌ర్బంగా ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి కుమార్తె కైవ‌ల్యా రెడ్డి.. నారా లోకేష్‌తో భేటీ కావ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. కైవ‌ల్యా రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకుంటార‌ని.. గ‌తంలో త‌న తండ్రి గెలిచిన ఆత్మ‌కూరు నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి.

మ‌రోవైపు త‌న కుమార్తె కైవ‌ల్యారెడ్డిని ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డే టీడీపీలోకి పంపుతున్నార‌ని గాసిప్స్ వినిపించాయి. అంతేకాకుండా గ‌త కొంత‌కాలం ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వంపై పలు వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అధికారుల‌ను సైతం తూర్పూర‌బ‌డుతున్నారు.

ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డి టీడీపీలోకి వెళ్ల‌నున్నార‌ని.. అందుకే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ మొద‌టి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాద‌వ్ కు మంత్రి ప‌ద‌వి ద‌క్కింది. ఇక రెండోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఆనం రాంనారాయ‌ణ‌రెడ్డిని ప‌ట్టించుకోలేదు. పార్టీ నేత‌లు కూడా ఆయ‌న‌ను లైట్ తీసుకుంటున్నార‌ని చెప్పుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఆనం రాంనారాయణ‌రెడ్డి టీడీపీ వైపు చూస్తున్నార‌ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ దిశ‌గా ఆయ‌నైతే ఎక్క‌డా బ‌య‌ట‌ప‌డ‌లేదు. మ‌రోవైపు ఆయ‌న వైఎస్సార్సీపీలో కొన‌సాగినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు ద‌క్క‌డం క‌ష్ట‌మేనంటున్నారు. అందుకే ఈసారి టీడీపీలో చేరి త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం ఆత్మ‌కూరు నుంచి బ‌రిలోకి దిగుతార‌ని గాసిప్స్ వ‌స్తున్నాయి. అయితే.. ఆనం మాత్రం వైఎస్సార్సీపీని ఎట్టి ప‌రిస్థితుల్లో వీడ‌ర‌ని అంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణ‌యం తీసుకుంటార‌ని చెబుతున్నారు.