Begin typing your search above and press return to search.

సీనియర్ అయినా ఒంటరైపోయాడా?

By:  Tupaki Desk   |   14 Sep 2020 2:30 AM GMT
సీనియర్ అయినా ఒంటరైపోయాడా?
X
జిల్లాలోని సీనియర్ నేతల్లో ఆయన కూడా ఒకరు. పైగా ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా ఉంది ఆయనకు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే అధికారంలో ఉన్నా ఆయన అదృష్టం మాత్రం తిరగబడిందట. ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారా ? అయనే ధర్మాన ప్రసాదరావు. వైసిపి అధికారంలోకి రాగానే తనకు మంత్రిపదవి ఖాయమని అనుకున్నారు. కానీ అదృష్టం తృటిలో తప్పిపోయిందట. అయితే మంత్రిపదవి తనకు రాకపోయినా తన సోదరుడు ధర్మాన కృష్ణదాసునే వరించింది. అయితే మాత్రం ఏమిటి తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్న సామెతలాగ మంత్రి పదవి వస్తే ఆ కిక్కే వేరుకదా. అందుకనే ప్రసాదరావులో తీవ్ర అసంతృప్తి పేరుకుపోతోందట.

తనకు రాలేదనే మంట ఉండగానే ఎంతో జూనియర్ అయిన పలాస ఎంఎల్ఏ సీదిరి అప్పలరాజుకు ఈ మధ్యనే మంత్రిపదవి వచ్చేసేటప్పటికి ప్రసాదరావులో మంట ఇంకా పెరిగిపోతోందని పార్టీ వర్గాలు గుసగుసలు పోతున్నాయి. అసలు ప్రసాదరావుకు మంత్రిపదవి ఎందుకు రాలేదు ? అబ్బో అది పెద్ద కతేనట. అదేమిటంటే సోదరుల్లో మంత్రిపదవి ఎవరికి ఇవ్వాలో తేల్చుకుని చెప్పమని జగన్మోహన్ రెడ్డి ఛాయిస్ వాళ్ళకే వదిలేశారట. అయితే మొదటినుండి మంత్రపదవంటే సోదరుల్లో ప్రసాదరావునే వరిస్తోంది. కాబట్టి ఇపుడు కూడా ప్రసాద్ కే మంత్రపదవి అని కృష్ణదాస్ ఫిక్సయిపోయారని సమాచారం.


అయితే ఉరుములేని పిడుగులాగ మధ్యలో దువ్వాడ శ్రీనివాస్ ఎంటరయ్యాడని సమాచారం. ఎందుకంటే తాను శ్రీకాకుళంలో ఓడిపోవటానికి కారణమే ప్రసాదరావని ఫిర్యాదు చేశాడట. మరి దువ్వాడంటే జగన్ కు అపరిమితమైన ప్రేమ. దానికితోడు తన ఓటమికి దారితీసిన పరిస్ధితులను ఇతర నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను లెక్కలతో సహ దువ్వాడ సిఎంకు వివరించి చెప్పాడట. దువ్వాడ లెక్కలతో ఏకీభవించిన జగన్ మంత్రిపదవి ఇస్తే కృష్ణదాసుకే ఇస్తానని స్పష్టం చేసినట్లు పార్టీలోనే ప్రచారంలో ఉంది. దాంతో చేసేది లేక కృష్ణదాసు మంత్రివర్గంలో చేరిపోయారు. అప్పటి నుండి జగన్ పై ప్రసాద్ కు మంటగానే ఉందని సమాచారం.

అందుకనే తప్పని పరిస్ధితుల్లో మాత్రమే ప్రసాదరావు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని మిగిలిన సమయమంతా దూరంగానే ఉంటున్నారట. పార్టీ ఆఫీసుకు రావటం, నేతలు, కార్యకర్తలతో భేటిలు కూడా పెద్దగా ఉండటం లేదని జిల్లాలో చెప్పుకుంటున్నారు. ఇదే నేపధ్యంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు రావటం కరోనా వైరస్ కారణంగా వాయిదాపడటంతో ప్రసాదరావు అలక ప్రభావం ఎంతన్నది స్పష్టంగా తెలియటం లేదు. ప్రసాదరావు లాగే భంగపడ్డ నేతలు ఇంకా ఎవరైనా ఉన్నారా అనే విషయం బయటకు పెద్దగా రావటం లేద. మరి ఈ రోజు కాకపోయినా రేపైనా మళ్ళీ స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగటం ఖాయమే కదా. మరప్పుడు వీళ్ళ అలక ఏమవుతుందో చూడాలి.

మొన్నటి ఎన్నికల్లో వైసిపిని ఆధరించిన జిల్లాకు జగన్ చాలా ప్రాధాన్యత ఇచ్చినట్లే చెప్పుకోవాలి. పది నియోజకవర్గాల్లో ఎనిమిదింటిని వైసిపినే గెలుచుకుంది. రెవిన్యు మంత్రే కాకుండా కృష్ణదాసును ఉపముఖ్యమంత్రి కూడా. అలాగే మరో సీనియర్ నేత తమ్మినేని సీతారామ్ స్పీకర్ అయ్యారు. అలాగే జూనియర్ అయిన అప్పలరాజు మంత్రి అయ్యారు. అంటే చిన్న జిల్లానే అయినా రాజకీయంగా చాలా ప్రాధాన్యతే దక్కినట్లే. మరి పదవులను ఆశించిన ప్రతి ఒక్కరికీ ఇవ్వాలంటే జగన్ కు కాదు కదా ఎవరికీ సాధ్యంకాదన్న విషయం ప్రసాద్ లాంటి వాళ్ళు గ్రహించాలి.