Begin typing your search above and press return to search.

డిప్యూటీ సీఎంకు సొంత పార్టీ నేతల నుంచే కాక!

By:  Tupaki Desk   |   5 April 2023 1:00 PM GMT
డిప్యూటీ సీఎంకు సొంత పార్టీ నేతల నుంచే కాక!
X
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. ముఖ్యమంత్రి జగన్‌ కు వీర విధేయుడిగా ముద్రపడ్డారు. మంత్రిగా ప్రమాణం చేసేటప్పుడు తనకంటే వయసులో దాదాపు 25 ఏళ్లు చిన్నవాడైన సీఎం జగన్‌ కు పాదాభివందనం చేశారు. అలాంటి నారాయణస్వామికి సొంత పార్టీ నేతల నుంచే అసమ్మతి ఎదురైంది.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలానికి చెందిన వైసీపీ నేతలు నారాయణస్వామిపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సొంత పార్టీ నేతలను పక్కనపడేసి టీడీపీ నుంచి వచ్చినవారికి డిప్యూటీ సీఎం ప్రాధాన్యత ఇస్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపించారు. అంతేకాకుండా సొంత పార్టీ నేతలపైనే పోలీసు కేసులు పెట్టించి వారితో కొట్టిస్తున్నారని విమర్శించారు. సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల నియామకాల్లో తమను మాట మాత్రంగా కూడా సంప్రదించలేదని అసమ్మతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని అడిగి ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని నారాయణస్వామిని నిలదీశారు. ఎవరిని అడిగి మండల పార్టీ కన్వీనర్లను మార్చేశారని ప్రశ్నించారు.

చివరకు గడప, గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను కూడా డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆహ్వానించడం లేదని అసమ్మతి నేతలు తప్పుబట్టారు. పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోకుండా నియమించిన సచివాలయ కన్వీనర్లను అంగీకరించబోమని తేల్చిచెప్పారు. వైఎస్‌ జగన్‌ కోసం కష్టపడి పార్టీని అధికారంలోకి తెస్తే.. నారాయణస్వామి అధికారులు, పోలీసుల్ని అడ్డుగా పెట్టుకుని తమపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అసమ్మతి నేతలు ఆరోపించారు.

మరోవైపు అసమ్మతి నేతల తీరుపై నారాయణస్వామి మండిపడ్డారు. సొంత పార్టీకి నష్టం చేసేవాళ్లను ఉపేక్షించబోనన్నారు. పెనుమూరు మండలంలో కొందరు సొంత పార్టీ నాయకులే కుట్ర రాజకీయాలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం ధ్వజమెత్తారు. అలాంటి వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
కొందరు భూములు కబ్జా చేశారని.. అలాంటివారికి నోటీసులు అందాయన్నారు. వారు తప్పు చేయకుంటే ఆ నోటీసులకు సమాధానం ఇవ్వాలి కానీ తనను విమర్శించడం ఏమిటని నిలదీశారు.

కార్వేటినగరంలో మాజీ ఎమ్మెల్యే ఈవీ గోపాలరాజు కుటుంబానికి చంద్రబాబు ఏం మేలు చేశారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్నించారు. అసమ్మతి నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి కచ్చితంగా ప్రాధాన్యం లభిస్తుందని తెలిపారు.

కాగా వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి తనకు బదులుగా తన కుమార్తె కృపాలక్ష్మికి సీటు ఇవ్వాలని నారాయణస్వామి కోరుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో నారాయణస్వామి ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. వైఎస్‌ జగన్‌ మొదటి మంత్రివర్గ విస్తరణలోనూ, రెండో మంత్రివర్గ విస్తరణలోనూ డిప్యూటీ సీఎంగా చాన్స్‌ కొట్టేశారు. కీలకమైన ఎక్సైజ్‌ శాఖ మంత్రిగా ఉన్నారు. మొదటి మంత్రివర్గ విస్తరణలో అయితే ఎక్సైజ్‌ శాఖతోపాటు వాణిజ్య పన్నుల శాఖను కూడా ఆయనే పర్యవేక్షించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.