Begin typing your search above and press return to search.

జగన్ పెదాల మీద అమరావతి నామం

By:  Tupaki Desk   |   26 May 2023 3:00 PM
జగన్ పెదాల మీద అమరావతి నామం
X
అమరావతి పేరుని ఒకప్పుడు జగన్ మాట్లాడేందుకే అంతగా ఇష్టపడేవారు కాదని అంటారు. చంద్రబాబు గారి గ్రాఫిక్స్ రాజధాని అని ఆయన ఇండైరెక్ట్ గా సెటైర్లు వేసేవారు. టీడీపీ వారి మీద వీరేదో రాజధాని అని అంటూ ఉంటారే అని కూడా దీర్ఘాలు తీసి మరీ తన సభలలో ఎద్దేవా చేసేవారు.

మరో తమాషా కూడా చెప్పుకోవాలి. జగన్ సీఎం గా గత నాలుగేళ్ళుగా పాలన చేస్తున్నారు. ఆయన ఉండేది కూడా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని తాడేపల్లిలో. అక్కడ జగన్ అద్భుతమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మంగళగిరి, తాడికొండ సహా కీలకమైన నియోజకవర్గాలు అన్నీ కలసి అమరావతి రాజధానిలో ఉన్నాయి.

అయినా సరే జగన్ నాలుగేళ్లలో ఆ ప్రాంతానికి వెళ్ళింది లేదు. ఇక సచివాలయానికి కూడా ఆయన వెళ్ళింది తక్కువే. అన్నీ తన నివాసం నుంచే చేస్తూ వచ్చారు. సమీక్షలు అయినా మీటింగ్స్ అయినా కూడా ఇదే తీరు. ఇంకో వైపు మూడు రాజధానుల నినాదాన్ని జగన్ ఎత్తుకున్నారు. దాంతో అమరావతిలో నాలుగేళ్ళుగా ఉద్యమాలు జరుగుతూ వచ్చాయి. విపక్షాలకు ఎక్కువగా అమరావతిలో పని పడితే అక్కడే నివాసం ఉన్న జగన్ మాత్రం ఆ వైపు తొంగి చూడలేదు అన్న విమర్శలు వచ్చాయి. ఎంతో మంది నాయకులు అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా వచ్చి వెళ్ళారు.

జగన్ సర్కార్ మీద ఘాటైన విమర్శలు చేశారు. అయినా సరే జగన్ మాత్రం వాటిని మౌనంగా వింటూనే ఉన్నారు. తన స్పందనను ఎక్కడా బయటపెట్టలేదు. మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం అమరావతి రాజధాని గురించి అనేక సార్లు వివాదాస్పదమైన కామెంట్స్ చేశారు.

అవన్నీ కూడా జగన్ మీదకే తిప్పి కొడుతూ విపక్షాలు ఆయనకు అమరావతి రాజధాని ఇష్టం లేదు అని ప్రచారం చేశాయి. ఎవరెన్ని అన్నా కూడా జగన్ వ్యూహాత్మకమైన్ మౌనంతోనే ముందుకు సాగారు. ఇంకో వైపు అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాలు అంటూ జగన్ సర్కార్ ముందుకు కదిలింది. దాని మీద గత మూడేళ్ళుగా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది. ఎట్టకేలకు ఈ రోజు ప్రభుత్వం పంతం నెగ్గింది.

ఏకంగా పద్నాలుగు వందల ఎకరాల భూమిలో యాభై వేల మంది లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం హోదాలో తొలిసారి ఆయన అమరావతి గడ్డ మీద అడుగు పెట్టారు. జగన్ ప్రసంగం ఆద్యంతం అమరావతి నామస్మరణతోనే సాగిపోయింది. అది కూడా చిరునవ్వులు చిందిస్తూ అమరావతి మనందరిదీ అని జగన్ పిలుపు ఇవ్వడం విశేషం.

ఇకపైన సామాజిక అమరావతి ఇది. ఇక్కడ అంతా ఉంటారు. అందరూ ఉండేదే అమరావతి అని పదే పదే జగన్ చెప్పడం ద్వారా టీడీపీ మీద ఇండైరెక్ట్ సెటైర్లు వేశారు. గతంలో అమరావతి ఒక సామాజికవర్గం గుప్పిట ఉందని వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ వచ్చారు.

ఇపుడు అదే చోట అమరావతి అందరి రాజధాని అని జగన్ అనిపించారు. తన పట్టుదలను ఆయన అలా నెగ్గించుకున్నారు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాదు ఇళ్ళు కూడా కట్టించి ఇస్తామని ప్రస్తుతం ఇచ్చిన ప్రాంతమంతా మరో కీలక ప్రదేశం అవుతుదని చెప్పుకొచ్చారు.

మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు నోటి వెంట అమరావతి అన్న మాట గతంలో చాలా సార్లు వచ్చింది. ఇపుడు జగన్ అమరావతి గానం చేస్తున్నారు. ఇది నా అమరావతి అంటున్నారు. నా అక్కచెల్లెమ్మల్ల అమరావతి అంటున్నారు. బాబు కలల రాజధాని అమరావతిలో జగన్ కూడా వాటా తీసేసుకున్నారు. మొత్తానికి అమరావతి విషయంలో అధికార వైసీపీ విపక్ష టీడీపీ రాజకీయ ఎత్తులు వ్యూహాలు ఎన్ని ఉన్నా మళ్ళీ అమరావతి మాత్రం గట్టిగా గంభీరంగా ముఖ్యమంత్రి నోట పలకడం మాత్రం విశేషంగానే చూడాల్సి ఉంది.