Begin typing your search above and press return to search.

జనసేన వర్సెస్ స్టింగ్ ఆపరేషన్ చానల్

By:  Tupaki Desk   |   12 Sept 2018 3:16 AM
జనసేన వర్సెస్ స్టింగ్ ఆపరేషన్ చానల్
X
టీడీపీ అనుకూల చానల్‌గా ముద్ర ఉన్న తెలుగు న్యూస్ చానల్ ఒకటి జనసేన పార్టీని లక్ష్యంగా చేసుకుని స్టింగ్ ఆపరేషన్ అంటూ ప్రసారం చేస్తున్న కథనం ఆ చానల్‌ను అభాసుపాల్జేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు వ్యాపారవేత్తలతో రహస్య సమావేశం ఏర్పాటుచేసి రూ.10 లక్షలు ఆపైన వారి నుంచి వసూలు చేశారంటూ సదరు చానల్ చేసిన కథనంపై జనసేన శతఘ్ని సభ్యలు ఆన్లైన్లో మండిపడుతున్నారు. ఇదేమీ రహస్య సమావేశం కాదని... ఆహ్వాన పత్రికలు ముద్రించి మరీ అందరినీ ఆహ్వానించారని.. అలాగే హాజరైనవారు కేవలం కాపు కులస్థులు మాత్రమే కాదని వారు చెప్పుకొస్తున్నారు. ఓఫెన్‌గా నిర్వహించిన సమావేశం గురించి స్టింగ్ ఆపరేషన్ అంటూ ఆ చానల్ ప్రసారం చేయడం పిచ్చితనమంటూ వారు దుమ్మెత్తి పోస్తున్నారు. దీంతో ఆ చానల్ ప్రజెంటర్, రిపోర్టర్ ఇద్దరిపైనా మేనేజ్ మెంట్ ఫైర్ అయినట్లు జనసేన వర్గాలు చెబతున్నాయి.

పవన్ కళ్యాణ్ ఒక సామాజిక వర్గానికి చెందిన వారితో రహస్య సమావేశం ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని వ్యాఖ్యాత తన లైవ్ ప్రోగ్రాంలో తెలిపారు. ఆ దృశ్యాలు మీకోసం టెలికాస్ట్ చేస్తున్నామంటూ ఒక భవనం సెల్లార్‌లో కొన్ని దృశ్యాలు పదేపదే చూపించారు. పవన్ కళ్యాణ్ ఆడిటర్ రత్నం డబ్బులు వసూలు చేస్తున్నాడంటూ ఆ కథనంలో ఆరోపించారు.

అయితే జనసేన వర్గాలు మాత్రం ఇదేమీ రహస్య సమావేశం కాదంటున్నాయి. దీనిపై 99టీవీలో ఈ సమావేశానికి సంబంధించి కొద్దిరోజులుగా ప్రకటనలు ఇస్తున్నామని జనసేన నాయకులు చెబుతున్నారు. ఈ సమావేశానికి అభిమానులు కూడా వెళ్లారని... జనసేనానితో ఫోటోలు కూడా దిగారని చెబుతున్నారు. అంతేకాదు.. జనసేన శతఘ్ని సభ్యులు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్ట్ చేస్తున్న ఫొటోల్లో ఆ చానల్ రిపోర్టర్ కూడా ఉండడం విశేషం. రహస్య సమావేశం అయితే ఆయన్నెందుకు రానిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు.

కాగా దీనిపై... జనసేన నాయకుడు దిలీప్ సుంకర మాట్లాడుతూ... జనసేన సమావేశంపై బురద జల్లుతున్నారంటూ మండిపడ్డారు. కేవలం టీఆర్‌పీల కోసమే ఆ సీనియర్ జర్నలిస్టు పాకులాడుతున్నాడని ఆరోపించారు.