Begin typing your search above and press return to search.

కేసీఆర్ త‌ర్వాత కొత్త నిర్మాణం ఇదే

By:  Tupaki Desk   |   25 Oct 2016 5:12 AM GMT
కేసీఆర్ త‌ర్వాత కొత్త నిర్మాణం ఇదే
X
ముందు సీఎం క్యాంపు కార్యాల‌యానికి మార్పులు - అనంత‌రం స‌చివాల‌యాన్ని కూల‌దోసి కొత్త నిర్మాణం - ఇదే ఊపులో కొత్త జిల్లాలు..ఇలా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌దిలో అంత కొత్త‌ధ‌నం కనిపిస్తోంది. స‌చివాల‌యం కూల్చివేత ఖ‌రారైన నేప‌థ్యంలో త‌ర్వాతి అడుగు ఏంటి? అంటే పార్టీ కార్యాల‌య‌మైన‌ టీఆర్‌ ఎస్‌ భవన్ అంటున్నారు. అయితే దీనికి వేరే ప‌రిష్కార మార్గం ఉందంటున్నారు. ప్రస్తుత తెలంగాణ భవన్‌ ను అలాగే ఉంచి.. అత్యాధునిక హంగులతో.. దేశంలోనే ఆదర్శంగా భారీ భవన నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. కొత్త కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించి.. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒకసారి.. ఆర్కిటెక్ట్‌ లతో చర్చించినట్లు సమాచారం ఉండగా.. కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కాగానే.. ఈ భవన్‌ పై దృష్టి పెట్టనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం బంజారాహిల్స్‌ లో ఉన్న తెలంగాణ భవన్‌ ను 2006 - ఆగస్టు 14న ప్రారంభించగా.. గడచిన దశాబ్దకాలంగా పార్టీ అనేక విజయాలకు సాక్షిగా నిలిచింది. అనేక వ్యూహాలకు - ఉద్యమాలకు కేంద్రమైంది. వాస్తును బలంగా నమ్మే కేసీఆర్‌.. పక్కా ప్రణాళికతో ఎకరం స్థలంలో ఈ తెలంగాణ భవన్‌ నిర్మించగా టీఆర్‌ ఎస్‌ గడచిన పదేళ్ళకాలంలో ఎవరూ ఊహించనంత ఎత్తుకు ఎదిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంతో పాటు.. అధికారం కూడా చేపట్టి చరిత్ర సృష్టించింది. పార్టీ అధినేత కేసీఆర్‌ దేశంలోనే.. నూతన రాజకీయ శకానికి తెరతీశారు. ఉద్యమ పార్టీగా.. దూకుడుగా వ్యవహరించిన టీఆర్‌ ఎస్‌.. అధికారం చేపట్టాక పరిపాలనలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తూ.. కొత్తకొత్త పథకాలతో దేశానికే మార్గదర్శకమవుతోంది. తెలంగాణ పథకాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ అనేకమార్లు ప్రశంసలు గుప్పించగా.. ఇపుడు మిషన్‌ భగీరథను దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు వరుసగా రాష్ట్రాల సమావేశాలు నిర్వహిస్తోంది. మిషన్‌ కాకతీయతో శెభాష్‌ అనిపించుకుంది.

తెలంగాణ భవన్‌ వాస్తు బలంగా ఉండడం కూడా పార్టీ ఎదుగుదలకు దోహదపడిందని పలువురు నేతలు అంటున్నారు. అదే స‌మ‌యంలో టీఆర్‌ ఎస్‌ అధికారంలోకి వచ్చాక.. పార్టీ బలం మునుపటిలా.. లేదు. చాలా గ్రామాల్లో మరో పార్టీ లేకుండా పోయింది. గత ఎన్నికల్లో పోటీచేసిన అన్ని ప్రధానపార్టీల అభ్యర్థులూ గులాబీ గూటికి చేరిన నియోజక వర్గాలు. అనేకం. ఈ పార్టీ.. ఆ పార్టీ అని లేకుండా.. అన్ని పార్టీల గాలి.. కారువైపు మళ్ళింది. పార్టీ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చిన రాజకీయ పునరేకీక రణ మంత్రం ఫలించింది. ఫలితంగా.. ఇతర పార్టీల నుండి గెలిచిన.. 26మంది ఎమ్మెల్యేలు - ఇద్దరు ఎంపీలు.. వేలాది ప్రజాప్రతినిధులు కారెక్కారు. ఇటీవల నిర్వహించిన సర్వే ఫలితాల లోనూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. 79శాతం ప్రజలు ముఖ్యమంత్రిగా కేసీఆరే కావాలని కోరుకుంటున్నట్లు ఆ సర్వేలలో తేలిందని గులాబీనేతలు సంతోషంగా చెబుతున్నారు. తెలంగాణ సమాజమంతా.. టీఆర్‌ ఎస్‌ వైపు నిలబడిన సందర్భంలో పార్టీ పునాదులను మరింత పటిష్ట పరిచేందుకు, ఈ బలాన్ని.. శాశ్వతం చేసుకునేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోనే మోడల్‌ గా ఉండే రీతిలో.. కార్యక్రమాల ప్రణాళిక రూపొందిస్తోంది. ప్రస్తుత భవనాన్ని శిక్షణా కార్యక్రమాలకు.. ఇతరత్రా పనులకు ఉపయోగించి, అధునాతన సౌకర్యాలతో దేశంలోనే మోడల్‌గా నయా తెలంగాణ భవన్‌ నిర్మించే యోచన జరుగుతోందని పార్టీ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుత భవన్‌ లో సౌకర్యాల లేమి కారణంగా జిల్లాల నుండి వచ్చే నాయకులు.. కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త భవన్‌ నిర్మాణం జరిగితే ఈ ఇబ్బందులు తొలుగుతాయని భావిస్తున్నారు. ఇపుడంతా.. కొత్త గాలి వీస్తోన్న తరుణంలో.. నయా తెలంగాణ భవన్‌ నిర్మాణానికి శ్రీకారం చుడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. రాజకీయవర్గాలు అంటున్నాయి. కొత్త భవన నిర్మాణానికి.. ముహూర్తం ఎపుడు ముడిపడుతుందోనన్న.. ఆసక్తి గులాబీ శ్రేణుల్లో ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/