Begin typing your search above and press return to search.

అందరి ముందు మంత్రి నిరంజన్ రెడ్డికి ఎంతలా తలంటు అంటేశారంటే?

By:  Tupaki Desk   |   28 April 2023 4:00 PM GMT
అందరి ముందు మంత్రి నిరంజన్ రెడ్డికి ఎంతలా తలంటు అంటేశారంటే?
X
ఆవేశం వస్తే గులాబీ బాస్ కేసీఆర్ ను ఆపటం కష్టమంటారు. ఆయనలో ఒక ఫ్లో మొదలైతే.. అది అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఏదైనా అంశం మీద మధనం మొదలైతే.. దాని మీదనే ఫోకస్ పెట్టేసి.. రోజుల తరబడి అలానే ఉండిపోవటం కనిపిస్తుంటుంది.

అలానే.. ఏదైనా అంశాన్ని టేకప్ చేస్తే దాని మీదనే ఉంటారు. ఆ సందర్భంగా ఆయన తన భావోద్వేగాల్ని దాచి పెట్టుకోరన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆ సందర్భంగా ఎవరేం అనుకుంటారో.. ఏమని ఫీల్ అవుతారన్నది అస్సలు పట్టించుకోరు. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా బీఆర్ఎస్ వ్యవస్థాప దినోత్సవం సందర్భంగా చోటు చేసుకుంది.

తెలంగాణ భవన్ లో పార్టీ ప్రతినిధులతో భేటీ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ఆ టైంలో మంత్రి నిరంజన్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు. తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఇటీవల ఆయన మాటలు వివాదమైన నేపథ్యంలో ఆ అంశాల్ని ప్రస్తావిస్తూ తలంటు కార్యక్రమాన్ని చేపట్టారు.

ఆయన ఫాంహౌస్ భూముల గురించి విపక్షాలు విరుచుకుపడటం.. ఆ సందర్భంగా వారి ఆరోపణలకు మంత్రి నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చే వేళలో.. ఆయన మాటలు అండర్ లైన్ చేసుకునేలా మారాయి. మంత్రి వివరణ ఇవ్వకున్నా బాగుండేన్న అభిప్రాయం వ్యక్తమైంది.

తాజాగా ఈ ఎపిసోడ్ ను ప్రస్తావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. 'దారిన పోయేవాళ్లు రాళ్లు వేస్తే.. తలకాయ లేని వాళ్లు మాట్లాడితే స్పందిస్తావా? ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తావా? నీ పని నువ్వు చేస్కో. ఎవరి మీద ఎవరు మాట్లాడినా పట్టించుకోవద్దు' అంటూ దిశానిర్దేశం చేశారు. తన ప్రసంగంలో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ లోని మాజీ మంత్రులు కడియం శ్రీహరి.. రాజయ్యల మధ్య పంచాయితీని ప్రస్తావిస్తూ.. ఒకరిపై ఒకరు మాట్లాడుకొని పలుచన కావొద్దని.. పార్టీని పలుచన చేయొద్దని చెప్పారు.

ఇలాంటి పరిస్థితే మరికొన్ని నియోజకవర్గాల్లో ఉందని చెప్పిన కేసీఆర్.. వారి పేర్లను మాత్రం ప్రస్తావించలేదు. మొత్తంగా అందరి ఎదుట ఎక్కువ అక్షింతలు మంత్రి నిరంజన్ రెడ్డికి ఎక్కువ పడితే.. ఆ తర్వాత చోటు రాజయ్య, కడియంలు నిలిచారు.