Begin typing your search above and press return to search.

దశాబ్ది ఉత్సవాల వేళ సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్ ఏమిటంటే?

By:  Tupaki Desk   |   2 Jun 2023 4:00 PM GMT
దశాబ్ది ఉత్సవాల వేళ సీఎం కేసీఆర్ స్పీచ్ హైలెట్స్ ఏమిటంటే?
X
తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలు ఈ రోజు (జూన్2, శుక్రవారం)నుంచి మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా ఉత్సవాల్ని నిర్వహించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 21 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం గన్ పార్కు వద్దకు వెళ్లిన కేసీఆర్ అమరవీరులకు నివాళులు అర్పించారు.

అనంతరం కొత్త సెక్రటేరియట్ కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''సంపద పెంచుదాం.. ప్రజలకు పంచుదాం. సంక్షేమంలో రాష్ట్రం స్వర్ణయుగాన్ని ఆవిష్కరించింది. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. మిషన్ భగీరథతో తాగునీటి సమస్యను పరిష్కరించాం. మన పల్లెలకు జాతీయ స్థాయి అవార్డులు వస్తున్నాయి. నిన్నటి ఉద్యమ తెలంగాణ.. నేటి ఉజ్వల తెలంగాణ. సాగుకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ'' అని వ్యాఖ్యానించారు.

- ఒకప్పుడు తెలంగాణ పల్లెలు.. పట్టనాల్లో ఎక్కడ చూసినా చెత్తా చెదారం పేరుకుపోయి కనిపించేది. పరిసరాలు అపరిశుభ్రంగా.. దుర్గంధ భూయిష్టంగా ఉండేవి. పాడుపడిన ఇళ్లు శిథిలాలు.. ప్రమాదకరంగా ఉన్న బావులు.. పసిపిల్లలు పడిపోయేలా బోరు పొక్కలు వంగి ఉండేవి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయి.. జారిపోయి ఎక్కడ షాక్ కొడతాయో అనేలా వేలాడేవి.

- భయపెట్టే విద్యుత్ తీగలు.. గుంతలమయంగా రహదారులు.. బురదమయంగా వీధులు.. పిచ్చి చెట్ల పొదలు.. మురుగు పేరుకున్న కాల్వలు.. మిణుకు మిణుకుమనే వీధి లైట్లు ఉండేవి.ఇప్పుడు అన్ని సమస్యల పరిష్కారం అయ్యాయి. పల్లె ప్రగతి.. పట్టణ ప్రగతి కార్యక్రమాలు గ్రామాలు.. పట్టణాల రూపురేఖల్ని మార్చేశాయి.

- గతంలో మూడు నాలుగు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉంటే గొప్ప. తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించింది. పారిశుద్ధ్య నిర్వహణకు, మొక్కల పెంపకానికి కావాల్సిన సాధనాలను సమకూర్చింది. ఈ రోజు తెలంగాణలోని ప్రతి గ్రామం ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కలిగి ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకూ ఈ రకమైన వసతులు లేవు.

- తెలంగాణలోని 12,769 గ్రామాలను అంటే 100 శాతం గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్ది దేశంలోనే టాప్ ర్యాంక్‌ను సాధించింది. ఇటీవల న్యూఢిల్లీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మన పల్లెలకు 13 జాతీయ అవార్డులు లభించాయి. వీటిని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయా స్థానిక సంస్థల ప్రతినిధులు అందుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 అవార్డుల్లో రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలు అవార్డుల్ని గెల్చుకున్నాయి.

- నేడు తెలంగాణ గ్రామాలను చూసిన వారెవరైనా ఇవి ఒకప్పటి గ్రామాలేనా? ఇంతలో ఎంత మార్పు? అని ఆశ్చర్యపోయే విధంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగింది.

- 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే ఉండేది. తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115లకు పెరిగింది. పదేళ్ల చిరుప్రాయంలో తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల కన్నా మిన్నగా నిలిచింది.

- 2014లో రాష్ట్ర జీఎస్.డి.పి విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉంది. నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీ.ఎస్.డి.పి 12,93,469 కోట్లకు పెరిగింది. కరోనా, డీ మానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తూ.. దశాబ్ది ముంగిట తెలంగాణ నిలిచింది.

- ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు. ఎటు చూసినా వరి కోతలే కనిపిస్తున్నాయి. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచింది. ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది.

- వృత్తి పనుల వారికి ఆర్ధిక ప్రేరణ ఇవ్వటంలో తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లె ప్రగతితో గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగాయి. మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయి.

- ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా తెలంగాణ అనేకరంగాల్లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది.

- తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నా.

- పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నది. జూన్‌ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అటవీ భూములపై ఆధారపడిన ఒక లక్షా యాభైవేల మంది ఆదివాసీ, గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

- దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కుల వృత్తుల కుటుంబాలకు కుటుంబానికి రూ.లక్ష ఆర్ధికసాయం అందిస్తున్నాం. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది.

- గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టాం. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుంది.