Begin typing your search above and press return to search.

మోడీతో భేటీకి టైం అడిగిన కేసీఆర్.. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   13 Dec 2019 5:03 AM GMT
మోడీతో భేటీకి టైం అడిగిన కేసీఆర్.. ఎందుకంటే?
X
వాత పెట్టి వెన్న రాయటానికి టాలెంట్ కావాలి? ఒకవైపు కీలకమైన బిల్లుకు మద్దతు ఇవ్వకుండా షాకిచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అనూహ్యంగా ప్రధానమంత్రితో భేటీ అయ్యేందుకు సమయం కోరుతూ లేఖ రాశారు. సాధారణంగా ప్రధానిని కలిసేందుకు టైం అడిగిన సందర్భంలో లోగుట్టుగా అడుగుతారు. అధికారికంగా కన్ఫర్మేషన్ అయ్యాక ప్రధానిని ఎప్పుడు కలిసేదన్న విషయాన్ని వెల్లడిస్తూ ప్రకటనలు జారీ చేస్తారు.

తాజాగా అందుకు భిన్నంగా.. టైం అడిగే వేళలోనే ఆ సమాచారాన్ని మీడియాకు అందజేయటం ఆసక్తికరంగా మారింది. కీలకమైన పౌరహక్కుచట్టాన్ని సవరించిన బిల్లుపైన మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయటమే కాదు.. టీఆర్ఎస్ ఎంపీలు జీఎస్టీ వాటాల విషయంలోనూ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ నిరసన ప్రదర్శలు చేపట్టారు.

ఇలాంటివేళ.. ఎవరూ ఊహించని రీతిలో ప్రధాని మోడీతో భేటీ అయ్యేందుకు డిసైడ్ అయ్యారు. జీఎస్టీ బకాయిలు.. కేంద్ర పన్నుల్లో వాటా తగ్గుదల ఇతరత్రా కారణాల్ని చర్చించేందుకు ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ కోరారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెల 14న (మంగళవారం) ప్రధాని మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు.

పన్నుల్లో రాష్ట్రాల వాటా సక్రమంగా రాకపోవటంతో వివిధ పథకాల అమలుకు ఇబ్బందిగా మారినట్లు చెబుతున్నారు. కేంద్రం నేరుగా వసూలు చేసే ఆదాయ.. ఇతర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద రూ.19,719 కోట్లు కేటాయించింది. అయితే.. తమకురావాల్సిన దాని కంటే కేంద్రం రూ.924 కోట్లు తక్కువగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం కారణంగా జీఎస్టీ వసూళ్లు తగ్గాయని.. ఆ లోటును కేంద్రమే పరిహారం కింద తీర్చాలని కోరనున్నారు. మరీ.. లెక్కలకు మోడీ మాష్టారు ఎలా స్పందిస్తారన్నదే అసలు ప్రశ్న.