Begin typing your search above and press return to search.

మంత్రులతో కేసీఆర్ భేటీ.. ఏకంగా ఆరున్నర గంటల పాటు సాగింది

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:45 AM GMT
మంత్రులతో కేసీఆర్ భేటీ.. ఏకంగా ఆరున్నర గంటల పాటు సాగింది
X
చాలామంది ముఖ్యమంత్రులకు భిన్నమైన సీఎంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను చెప్పారు. మంత్రులతో సహా మిగిలిన నేతలను కలిసేందుకు పెద్దగా అవకాశం ఇవ్వనిఆయన.. ఎప్పుడైనా సమావేశం సందర్భంగా కానీ.. కేబినెట్ సమావేశం సందర్భంగా కానీ కలిస్తే మాత్రం.. గంట.. రెండు గంటలుకాకుండా సుదీర్ఘంగా సమావేశాన్ని నిర్వహించటం ఆయనకో అలవాటు. తాజాగా మంత్రులతో కలిసి నిర్వహించిన భేటీలోనూఈ సంప్రదాయం కొనసాగింది. ఏకంగా ఆరున్నర గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.

గ్రేటర్ ఎన్నికలపై కార్యాచరణ.. దుబ్బాక ఫలితంపై మాట్లాడటంతో పాటు.. రానున్న రోజుల్లో ఏం చేయాలన్న అంశంపై చర్చ సాగినట్లుగా చెప్పాలి. త్వరలోజరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకమైన ఓటరు నమోదు అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించటమే కాదు.. దాని కార్యాచరణ ఎలా ఉండాలన్న అంశంపై కేసీఆర్ పలు సలహాలు.. సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించాలని చెప్పటమేకాదు.. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ముఖ్యనేతలను ఇన్ ఛార్జీలుగా బాధ్యతలు అప్పగిస్తామని.. డివిజన్ల వారీగా పార్టీ ఇన్ ఛార్జీల పేర్లను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీ పటిష్ట స్థితిలో ఉన్నట్లు అంతర్గతంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది.

దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంపై మాట్లాడిన ఆయన.. హరీశ్ ప్రస్తావన అస్సలు తీసుకురాలేదంటున్నారు. దుబ్బాక ఓటమిని చూసి బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదన్న కేసీఆర్.. గాలివాటు గెలుపును చూసి గాబరా చెందాల్సిన అవసరం లేదంటూ విషయాన్ని సింఫుల్ గా తేల్చేసినట్లుగా తెలుస్తోంది. పార్టీకి పటిష్టమైన యంత్రాంగం.. బలమైన నేతలు ఉన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. గ్రేటర్ లో 2016లో మాదిరే తాజా ఎన్నికల్లోనూ మంచి ఫలితాల్ని సాధిస్తుందన్న మాటను నమ్మకంగా చెప్పినట్లు సమాచారం.

గ్రేటర్ లో మౌలిక వసతుల కల్పన కోసం రూ.60వేల కోట్ల నిధుల్ని ఐదేళ్లలో ఖర్చు చేశామని.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత డివిజన్ ఇన్ ఛార్జీలుగా నియమితులయ్యే వారు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేసిన కేసీఆర్.. పార్టీ నేతలు.. కార్యకర్తల మధ్య సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఇన్ చార్జీలదేనని తేల్చి చెప్పటం గమనార్హం.