Begin typing your search above and press return to search.

మోడీతో సారు మీటింగ్.. ‘ఎన్ని అంశాలు కలుస్తున్నాయో?’

By:  Tupaki Desk   |   13 Dec 2020 3:56 AM GMT
మోడీతో సారు మీటింగ్.. ‘ఎన్ని అంశాలు కలుస్తున్నాయో?’
X
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా ప్రధాని మోడీని కలిశారు. వివిధ అంశాలపై చర్చించారు. అన్నింటికి మించి దాదాపు 45 నిమిషాల పాటు ఏకాంతంగా నేతలు ఇద్దరు భేటీ అయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే.. ఈ భేటీకి రోజు ముందు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను తెలంగాణ సీఎం కలిసిన రీతిలోనే.. శనివారం రాత్రి భేటీ సాగిందని చెప్పాలి. ఈ రెండు సమావేశాలకు సంబంధించి పలు పోలికలు ఉండటం గమనార్హం.

శుక్రవారం అమిత్ షాతో.. శనివారం ప్రధాని మోడీతో సమావేశమైన రెండు సమయాలు రాత్రి వేళలోనే కావటం గమానార్హం. అంతేకాదు.. షాతోఏకాంతంగా 40 నిమిషాలు మాట్లాడితే.. ప్రధాని మోడీతో 45 నిమిషాలు మాట్లాడటం గమనార్హం. ఇద్దరు నేతలతో సమావేశమైన కేసీఆర్.. ఏం చర్చించారు అన్న అంశంపై అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఇరువురితో భేటీ సందర్భంగా విడుదలైనఫోటోల్ని చూస్తే.. ఇంచుమించు ఒకే యాంగిల్ లో ఉన్నట్లుగా కనిపించక మానదు.

కేంద్రం ముందు రాష్ట్రానికి అవసరమైన అంశాల్ని పెట్టినట్లుగా చెప్పటం తెలిసిందే. కాకుంటే అమిత్ షాను కలిసినప్పుడు రూ.5వేల కోట్ల సాయాన్ని కేసీఆర్ అడిగినట్లుగా చెప్పగా.. తాజాగా ప్రధానితో భేటీ సందర్భంగా రూ.1300 కోట్ల సాయాన్ని ప్రస్తావించటం గమనార్హం. పద్నాలుగు నెలల క్రితం ప్రధాని మోడీతో భేటీ అయిన కేసీఆర్.. అప్పట్లో 50 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఆ సందర్భంగా22 అంశాలకు సంబంధించి లేఖలు ఇచ్చారు. ఈసారి మాత్రం ఏకాంత భేటీ సమయం ఐదు నిమిషాలు తగ్గింది. మొత్తంగా చూస్తే.. రోజు తేడాతో ఇద్దరు ముఖ్యనేతలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ రాజకీయంగా తీవ్రమైన ఆసక్తిని రేపుతోంది. కేంద్రంపై యుద్ధమేనంటూ తొడ కొట్టినంత పని చేసిన సీఎం సారు.. ఇప్పుడు ఇలా వంగి మరీ నమస్కారం పెట్టటం ఏమిటో?