Begin typing your search above and press return to search.

కిరణ్ కుమార్ రెడ్డికి కావాల్సిందేంటి... కాంగ్రెస్ ఏమి తక్కువ చేసింది...?

By:  Tupaki Desk   |   13 March 2023 7:00 AM
కిరణ్ కుమార్ రెడ్డికి  కావాల్సిందేంటి... కాంగ్రెస్ ఏమి తక్కువ చేసింది...?
X
ఉమ్మడి ఏపీకి చిట్టచివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయనను దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రానికి మూడేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా చేసిన ఘనత కాంగ్రెస్ ది. నిజానికి కిరణ్ కుమార్ రెడ్డికి సొంత బలం లేదు. ఆయన సీఎం అయ్యే సమయానికి కూడా వర్గం అంటూ ఎవరూ పెద్దగా లేరు. అయితే ఆయన నాటికి యంగ్ లీడర్ అని రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు అని, నాడు యువనేతగా ఉన్న జగన్ని కట్టడి చేయగలరని భావించి సీఎం ని చేశారు.

ఆ విషయంలో ఆయన కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలను వమ్ము చేశారనే చెప్పాలి. జగన్ ఆయన ఏలుబడిలోనే మరింతగా ఎదిగారు. ఏకంగా 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గడప దాటి వెళ్ళిపోయి జగన్ వైపు చేరిపోయారు. అయితే ఆయన పాలనాపరంగా కొంత మంచి పేరు తెచ్చుకున్నారు. మూడేళ్ళ పాటు పాలించి కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలో కూలకుండా తెలుగుదేశంతో రహస్య చెలిమి చేసి కాపాడుకున్నారు.

అయితే సొంత ఇమేజ్ లేని కిరణ్ కుమార్ రెడ్డి ఆ తరువాత కాంగ్రెస్ కి విధేయత చూపించకపోగా ఏకంగా ఎన్నికల ముందర ఇబ్బంది పెట్టెలా వ్యవహరించారని చెప్పాలి. ఆయన లాస్ట్ బాల్ అంటూ ఇటు సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టారు. అదే విధంగా అధినాయకత్వం విభజన అంటే సమైఖ్యాంధ్రా అంటూ చివరి నిముషంలో అడ్డం తిరిగారు. అదే ఆయన ముఖ్యమంత్రిగా ముందే ఆ మాట చెప్పి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో కదా అన్న మాట కూడా ఉంది.

ఇదిలా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి జై సమైఖ్యాంధ్రా పార్టీ పెట్టి 2014లో తన అభ్యర్ధులను నిలబెట్టారు కానీ అంతా ఓడారు. ఆ మీదట కొన్నాళ్ళు మౌనంగా ఉండి రాహుల్ గాంధీ సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత అయినా ఆయన కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేసే చర్యలను చేపట్టారా అంటే లేదు అనే జవాబు వస్తుంది. తెలంగాణా ఏపీలలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపడితే కిరణ్ కుమార్ రెడ్డి కనీసం పాదయాత్రకు వెళ్ళలేదు.

దానికి కారణం ఆయన పెట్టుకున్న ఆశలు అని అంటారు. ఆయనకు రాజ్యసభ సహా ఎవైనా పదవులు ఇచ్చి ఉంటే ఆయన చురుకుగా ఉండేవారు అని అంటారు. అయితే అన్నింటికన్నా పెద్ద పదవి సీఎం నే ఆయనకు ఇచ్చారు కదా అన్న మాటకు జవాబు ఉండదేమో. ఇక ఆయన తనకు ఇంత ఉన్నత అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కి తిరిగి ఏమి చేశారు అంటే రెండు సార్లు వెన్నుపోటు పొడిచారు అనే అనే చెప్పాలి.

ఇపుడు ఆయన రాజీనామా చేశారు. ఈ నెల 11న డేట్ తో ఆయన రాజీనామా చేసినట్లుగా ప్రకటన వెలువడింది. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన హై కమాండ్ కి లెటర్ రాశారు గత కొన్ని రోజులుగా పుకార్లుగా ఉన్న మాటే నిజం అవుతోంది అని అంటున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తారని అని కూడా ప్రచారం సాగుతోంది. ఆ విధంగా బీజేపీ ఆయనను తమ వైపునకు తిప్పుకుంది అని అంటున్నారు.

బీజేపీ పెద్దల తీరు చూస్తే తమకు లాభం లేని చోట ఏమీ ఇవ్వరనే అంటారు. మరి ఏపీలో కానీ తెలంగాణాలో కానీ బలం పెరగకపోతే కిరణ్ కుమార్ రెడ్డికి వారు ఏమిస్తారు అన్నది ఒక ప్రశ్న. ఆ సంగతి పక్కన పెడితే కాంగ్రెస్ లో ఎంతో గౌరవం ఇచ్చి ముఖ్యమంత్రిని చేశాక కూడా కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వారు ఆ పార్టీని వీడిపోవడం అంటే అది ఏ విధంగా చూడాలన్న ప్రశ్న ఉదయిస్తోంది.

ఇంతకీ కాంగ్రెస్ ఇలా అయిపోవడానికి ప్రజలు కారణం కాదని, తాము నెత్తికెక్కించుకున్న నేతలే అని ఢిల్లీ పెద్దలు తెలుసుకుంటే విధేయత కలిగిన నాయకత్వాన్ని తయారు చేసుకుంటే మంచిదన్న సూచనలు అయితే ఉన్నాయి. ఇక్కడ మరో మాట చెప్పాలి. నాడే జగన్ ని సీఎం చేసి ఉంటే కాంగ్రెస్ 2014 ఎన్నికల్లో ఓడినా ఇంతటి దారుణ పరిస్థితులు అయితే ఉండవన్నది లాజిక్ తెలిసిన వారు అనే మాట. కానీ కాంగ్రెస్ కి వైఎస్ ఫ్యామిలీకి చెడి కిరణ్ణి ఎంపిక చేసుకునారు. ఇపుడు కాంగ్రెస్ పరిస్థితి రెండింటికీ చెడిన రేవడి మాదిరా మారిందంటే ఆ పాపంలో ఎన్ని ఆశాకిరణాలు చేసిన కీడు ఎంత ఉంది అన్నదే మధింపు చేయాలని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.