Begin typing your search above and press return to search.

రాజంపేట నుంచి ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ...?

By:  Tupaki Desk   |   9 April 2023 3:30 AM IST
రాజంపేట నుంచి ఎంపీగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీ...?
X
కాంగ్రెస్ పార్టీతో ఉన్న ఆరు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని బీజేపీలో చేరిన ఉమ్మడి ఏపీ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏ తీరుగా సాగనుంది అన్నది చర్చకు వస్తోంది. కాంగ్రెస్ వంటి మహా సముద్రంలోనే ఇమడలేకపోయిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ వంటి సిద్ధాంతబద్ధమైన పార్టీలో ఎలా ఉంటారు అన్నదే సందేహంగా ఉంది.

అయితే తన స్థాయికి హోదాకు తగినట్లుగా అన్నీ మాట్లాడుకునే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారని అంటున్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ సముచిత రీతిలో గౌరవిస్తుందని తెలుస్తోంది. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని కట్టబెడతారని, సౌత్ లో ఏపీ తెలంగాణా, కర్నాటక రాష్ట్రాల బాధ్యతలను అప్పచెబుతారని అంటున్నారు.

ప్రస్తుతం కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీ కర్నాటక సరిహద్దుల్లో పెద్ద ఎత్తున రెడ్డి సామాజికవర్గం ఉంది. ఆ ఓట్లను బీజేపీ వైపు మళ్ళించే బృహత్తరమైన బాధ్యతను కిరణ్ కి అప్పగించారని అంటున్నారు. ఇక ఈ నెల రోజులూ కిరణ్ కుమార్ రెడ్డి కర్నాటక రాష్ట్రం మీదనే దృష్టి పెట్టాల్సి ఉంటుందని కూడా బీజేపీ పెద్దలు చెప్పినట్లు తెలుస్తోంది

దాంతో బీజేపీ కండువా కప్పుకుని ఢిల్లీ నుంచి వచ్చీ రావడంతోనే బెంగుళూరులో కిరణ్ కుమార్ రెడ్డి ల్యాండ్ అయ్యారు. ఆయన కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్పతో భేటీ అయి పార్టీ పరిస్థితి మీద చర్చించారు కర్నాటక బీజేపీకి సంబంధించి ఎన్నికల ప్రచారంతో పాటు సామాజిక సమీకరణలను బీజేపీకి అనుకూలం చేయడంతో తన వంతు పాత్రను పోషించడానికి కిరణ్ కుమార్ రెడ్డి రెడీ అయిపోతున్నారు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డిని ఏపీ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఆయనను రాజంపేట ఎంపీ సీటు నుంచి బరిలోకి దించుతారు అని అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి సొంత నియోజకవర్గం పీలేరు రాజంపేట లోక్ సభ పరిధిలో ఉండడమే దీనికి కారణం.

అదే విధంగా చూస్తే కర్నాటక తరువాత కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణా రాష్ట్ర రాజకీయాల మీద దృష్టి పెడతారు అని అంటున్నారు. ఆ మీదట ఆయన ఏపీ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టి దూకుడు చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏపీలో ఉమ్మడి శత్రువుగా ఉన్న జగన్ని ఎదుర్కోవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పొత్తుల విషయంలో కూడా కేంద్ర పెద్దలకు సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరడంతో ఏపీ బీజేపీ రాజకీయాలే కాదు, పొత్తుల విషయంలోనూ సంచలన మార్పులు నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.