Begin typing your search above and press return to search.

పీసీసీ కోసం ఎత్తుకు పైఎత్తు ..బరిలోకి సీనియర్లను దింపిన కోమటిరెడ్డి

By:  Tupaki Desk   |   13 Dec 2020 8:41 AM GMT
పీసీసీ కోసం ఎత్తుకు పైఎత్తు ..బరిలోకి సీనియర్లను  దింపిన కోమటిరెడ్డి
X
తెలంగాణలో పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో తెలియదు కానీ. రేసు మాత్రం రసవత్తరంగా సాగుతోంది. తెలంగాణ రాజకీయ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ కొద్ది రోజులుగా గాంధీభవన్లో మకాం వేసి కాంగ్రెసు సీనియర్ నాయకులతో పిసిసి అధ్యక్ష పదవి పై చర్చలు సాగిస్తున్నారు. ఇప్పటివరకు ఠాగూర్ 150 మంది వద్ద అభిప్రాయాలు సేకరించారు. అయితే ఇంకా పదవిపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ఈ పోస్టు కోసం పోటీపడుతున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన అభిప్రాయ సేకరణలో మాణిక్యం ఠాగూర్​కు పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారు? అనే విషయం చర్చనీయాంశం అయ్యింది.

చాలా మంది పార్టీ సీనియర్లు పీసీసీ అధ్యక్షుడిగా కోమటిరెడ్డి అయితే బాగుంటుందని, ఆయనకు మద్దతుగా నిలిచారని తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కొన్నేళ్లుగా పీసీసీ పదవి కోరుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాకమునుపే తనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని పలుమార్లు కోమటిరెడ్డి వెంకట రెడ్డి అధిష్టానానికి విన్నవించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. నల్లగొండలో జిల్లాలో బలమైన నేత కూడా. ఎన్నికల్లో మహా మహులు ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచారు.


పీసీసీ అధ్యక్ష పదవి ఎంపికకు మొదలుపెట్టినప్పటి నుంచి అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డి ఎంపిక అవుతారని గట్టిగా వినిపించింది. ఆయన పేరు ఖరారు అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. దీంతో వెంటనే కోమటిరెడ్డి అలర్టయ్యారు. మరోవైపు సీనియర్లు కూడా ఆయనకు మద్దతుగా నిలబడ్డారు.

ఇటీవల గాంధీభవన్​లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్​ను సీఎల్పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్​బాబు కలిశారు. వీరంతా కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయితే బాగుంటుందని, ఆయన ఎంపిక చేయాలని తమ అభిప్రాయాలను గట్టిగా వినిపించారట.

ఇదిలా ఉండగా మరోవైపు ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి మాత్రం రేవంత్​ రెడ్డికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని కోరుతున్నారు.కేసీఆర్ పై దూకుడుగా విమర్శలు చేసే రేవంత్ రెడ్డికి తెలంగాణలో భారీగానే ఫాలోయింగ్ ఉంది. సొంత బలంతో పాటు సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డికి సపోర్ట్ ఉంది. అందుకే పీసీసీ అధ్యక్ష అభ్యర్థుల ఎంపిక జాబితాలో రేవంత్ రెడ్డి పేరు కూడా ఉంది.

అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఈసారి వెనక్కి పోతే మళ్లీ పుంజుకోవడం కష్టమని భావిస్తూ ఎలాగైనా తనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. అటు పార్టీ సీనియర్ల మద్దతు కూడా కూడగట్టుకున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ రేసులో రావడంతో అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి కష్టంగా మారిందని తెలుస్తోంది. ఒకవేళ రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే మట్టి రెడ్డి వెంకట్ రెడ్డి సహా పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు ఎక్కడ బీజేపీ బాట పడతారోనని సోనియాగాంధీ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది.