Begin typing your search above and press return to search.

మోడీ సర్కారును ట్వీట్లతో ఏసుకునే బదులు.. ఇలా చేయొచ్చుగా కేటీఆర్?

By:  Tupaki Desk   |   18 July 2022 5:30 AM GMT
మోడీ సర్కారును ట్వీట్లతో ఏసుకునే బదులు.. ఇలా చేయొచ్చుగా కేటీఆర్?
X
డైలీ బేసిస్ లో మోడీ సర్కారుపై విరుచుకుపడుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.. ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

ప్రధానిపై విమర్శలు.. కేంద్ర సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న ఆయన.. సోషల్ మీడియా ద్వారా పోరు చేస్తున్న సంగతి తెలిసిందే. చేతిలో అధికారం ఉన్న కేటీఆర్.. సామాన్యుల మాదిరి తమ ఆక్రోశాన్నిసోషల్ మీడియాతో తీర్చుకునే కన్నా.. అందుకు భిన్నంగా వ్యవహరించొచ్చు కదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

గతానికి భిన్నంగా పాలు.. పెరుగు(ప్యాకేజీ)ను జీఎస్టీ పరిధిలోకి తెస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో అమల్లోకి వచ్చే దీనికి సంబంధించి ఇటీవల మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో హటాత్తుగా గుర్తుకు వచ్చినట్లుగా.. పాలు.. పెరుగును కూడా వదలరా? అంటూ ఆవేశంగా ట్వీట్ చేస్తున్న మంత్రి కేటీఆర్.. అదే పాలు.. పెరుగును జీఎస్టీ లో తెచ్చేందుకు జీఎస్టీ మండలిలో చర్చ జరిగినప్పుడు.. నిర్ణయం తీసుకున్నప్పుడు ఇదే తీరులో రియాక్టు అయి ఉంటే బాగుండేది కదా? అది వదిలేసి.. ఇప్పుడే నిర్ణయం తీసుకున్నట్లుగా ట్వీట్లు చేయటంలో అర్థం లేదన్న మాట వినిపిస్తోంది.

నిజంగానే పాలు.. పెరుగు మీద కేంద్రం విధించే జీఎస్టీని తెలంగాణలో వసూలు చేయమని.. అవసరమైతే తమ వాటాను వదులుకొని.. కేంద్రానికి ఇవ్వాల్సిన వాటాను ఇచ్చేస్తామన్న మాటను ఎందుకు చెప్పకూడదు. నిజంగానే.. ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్నదే మంత్రి కేటీఆర్ ఆలోచన అయితే.. భారం పడకుండా ఉండేందుకు వీలుగా పరిష్కారాలు వెతికి.. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా ఎందుకు నిలవకూడదు?

టిట్వర్ పిట్టతో ట్వీట్లు పలికిస్తూ.. అందులో అన్ని విమర్శలు.. ప్రశ్నలు సంధించే కన్నా.. మోడీ సర్కారు తీరుకు భిన్నంగా తాము చేస్తున్న ప్రయత్నాలను హైలెట్ చేస్తే బాగుంటుంది కదా? అది వదిలేసి.. ఇలాంటి విమర్శల వల్ల రాజకీయంగా కేటీఆర్ కు మైలేజీ రావొచ్చు. కానీ.. ప్రజల పర్సుల మీద పడే భారం మాటేమిటి? అన్నది అసలు ప్రశ్న. మరి.. కేటీఆర్ సాబ్ ఆ దిశగా ఆలోచన చేయొచ్చు కదా?