Begin typing your search above and press return to search.

నవరత్నాల గుడిని నిర్మించిన వైసీపీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   28 Feb 2023 3:30 PM GMT
నవరత్నాల గుడిని నిర్మించిన వైసీపీ ఎమ్మెల్యే
X
2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ నవరత్న పథకాలను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాలపైనే వచ్చే ఎన్నికల్లోనూ జగన్‌ ఆశలు పెట్టుకున్నారు. ఈ నవరత్న పథకాలతో లబ్ధి పొందినవారు తమకే ఓట్లేస్తారని వైసీపీ భావిస్తోంది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, అందరికీ ఇళ్లు, విద్యా కానుక, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ వంటి పథకాలను నవరత్నాల కింద అందిస్తున్నారు.

నవరత్న పథకాలపై వైసీపీ నేతలు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరిట ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలు పంచుతూ నవరత్నాల పథకాల గురించి వివరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌ రెడ్డి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏకంగా తన నియోజకవర్గంలో నవరత్నాల గుడిని నిర్మించారు.

2014లో శ్రీకాళహస్తి నుంచి తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసిన బియ్యపు మధుసూదన్‌ రెడ్డి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో వైసీపీ గాలిలో బియ్యపు మధుసూదన్‌ రెడ్డి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో తనకు బదులుగా తన కుమార్తె బియ్యపు పవిత్రా రెడ్డిని శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయించాలనే యోచనలో ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటికే పవిత్రా రెడ్డి నియోజకవర్గమంతా కలియదిరుగుతున్నారు. శ్రీకాళహస్తి దేవాలయానికి ఎవరైనా జాతీయ ప్రముఖులు వచ్చినప్పుడు పవిత్రా రెడ్డి హల్చల్‌ చేస్తున్నారు.

కాగా ఎమ్మెల్యే మధుసూదన్‌ రెడ్డి నవరత్నాల గుడిని తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో రెండు సెంట్ల స్థలం కొని దానిలో నిర్మించారు. వాస్తవానికి ఇలా తమకు నచ్చిన వ్యక్తులకు గుడులు కట్టే సంస్కృతి తమిళనాడు వాళ్లకు ఉంది. ఇప్పుడు అదే సంస్కృతిని అందిపుచ్చుకున్నారు.. బియ్యపు మధుసూదన్‌ రెడ్డి.

శ్రీకాళహస్తి నియోజకవర్గం తమిళనాడుకు సరిహద్దు నియోజకవర్గం. దీంతో తమిళనాడు తరహాలోనే ఆయన నవరత్నాల గుడిని నిర్మించారు. కాగా జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం ఆశపడ్డవారిలో బియ్యపు మధు కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడిగా బియ్యపు మధుకు పేరుంది. ఆయన ద్వారా మంత్రిని కావడానికి ప్రయత్నించినప్పటికీ చిత్తూరు జిల్లాలో రోజా మంత్రి పదవిని దక్కించుకోవడం మధుకు అవకాశం దక్కలేదు. కాగా నవరత్నాల గుడి వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.