Begin typing your search above and press return to search.

హైదరాబాద్ బ్రాండ్ కు దెబ్బ పడేలా ర్యాగింగ్.. కేటీఆర్ ట్వీట్ తో కొత్త టర్న్

By:  Tupaki Desk   |   13 Nov 2022 4:20 AM GMT
హైదరాబాద్ బ్రాండ్ కు దెబ్బ పడేలా ర్యాగింగ్.. కేటీఆర్ ట్వీట్ తో కొత్త టర్న్
X
హైదరాబాద్ అన్నంతనే చాలామందికి ఐటీ హబ్ గా.. ఐటీ ఉద్యోగులకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చే మహానగరంగా పేరుంది. కానీ.. పెద్దగా ఫోకస్ కాని మరో అంశం ఏమంటే.. ఇక్కడ ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో సీటు కోసం తపించేటోళ్లు బోలెడంత మంది ఉంటారు. అలాంటి ప్రముఖ కళాశాలల్లో ఒకటి ''ఐబీఎస్''. హైదరాబాద్ శివారున ఉన్న శంకర్ పల్లి మండలం దొంతనపల్లి గ్రామ శివారులో ఉండే ఈ బిజిసెన్ స్కూల్ హాస్టల్ లో.. దారుణ రీతిలో హింసకు గురి చేస్తూ ర్యాంగింగ్ చేసిన వైనానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ బయటకు వచ్చింది.

అత్యంత అమానవీయ తీరులో విద్యార్థి మీదకు ఎక్కి ఒకరు.. మిగిలిన వారు తమకు తోచిన విధంగా సదరు విద్యార్థిని దారుణమైన బూతులతో తిడుతూ.. కొడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది. పిడిగుద్దులు గుద్దుతూ.. ఒంటి మీద ఇష్టం వచ్చినట్లు కొడుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఉదంతంలో బాధిత విద్యార్థి ఒక వర్గానికి చెందిన వాడు కాగా.. దాడి చేసింది మరో వర్గం కావటం గమనార్హం.

ర్యాంగింగ్ వేళ ఏడిపించటం మామూలే అయినా.. ఈ వీడియోలో జూనియర్ ను సీనియర్లు రౌండ్ చేసి మరీ కొట్టిన వైనం చూస్తే.. శాడిజానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉండటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలను షేర్ చేసిన తీరు చూస్తే.. ఏ మాత్రం భయం లేకుండా ఉండటంతో పాటు తామేం చేసినా నడిచిపోతుందన్నట్లుగా ఉందన్న మాట వినిపిస్తోంది.

ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురి చేసి.. శారీరకంగా వేధింపులకు గురి చేసిన సీనియర్ల దెబ్బలకు తట్టుకోలేని బాధిత బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయటంతో.. మొత్తం ఘటన గురించి తెలుసుకొన్న తల్లిదండ్రులు భయంతో పరుగుపరుగున వచ్చి.. తమ పిల్లాడ్ని తమతో తీసుకెళ్లారు. ర్యాగింగ్ వేళ తీసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మంత్రి కేటీఆర్ కు.. హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్రకు సూచన చేశారు.

ఇదిలా ఉంటే.. పేరుకు ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ అనే కానీ.. ఈ క్యాంపస్ లో తరచూ ర్యాగింగ్ రచ్చ నడుస్తూనే ఉంటుందని.. తరచూ ఎవో గొడవలు ఖాయంగా జరుగుతుంటాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీలో ర్యాగింగ్ ఎప్పటినుంచో ఉందని.. ఈసారి దానికి సంబంధించిన వీడియో బయటకు రావటంతో ఈ రచ్చకు సరైన ఆధారం లభించినట్లుగా చెబుతున్నారు. తొలుత ఈ ర్యాగింగ్ ఇష్యూను స్థానిక పోలీస్ స్టేషన్ లో రాజీ చేసి.. వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లుగా చెబుతున్నారు.

ఎప్పుడైతే మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి.. ఈ ఇష్యూను సీరియస్ గా రివ్యూ చేయాలని చెప్పటంతో ర్యాగింగ్ కు పాల్పడిన పన్నెండు మంది విద్యార్థులను కాలేజీ యాజమాన్యం ఏడాది పాటు సస్పెండ్ చేసింది. అంతర్గత దర్యాప్తు కోసం ఆదేశాలు జారీ చేసింది. నివేదిక వచ్చిన తర్వాత మరింత మందిపై చర్యలు ఉంటాయని అంటున్నారు. అయితే..ఈ ర్యాగింగ్ ఎపిసోడ్ లో సున్నిత అంశాల ప్రస్తావనతో పాటు.. బోలెడన్ని ట్విస్టులు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఇరు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు కాపీలు బయటకు వస్తే.. మరిన్ని సంచలనాలు ఖాయమంటున్నారు. మొత్తంగాఈ ర్యాగింగ్ ఎపిసోడ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది. అందుకే.. మంత్రి కేటీఆర్ ఇష్యూను సీరియస్ గా తీసుకొన్నట్లుగా తెలుస్తోంది.