Begin typing your search above and press return to search.

టోల్ ప్లాజాలు తీసేస్తార‌ట‌.. హ్యాపీ న్యూస్ కాదు!

By:  Tupaki Desk   |   25 Jan 2019 4:50 AM GMT
టోల్ ప్లాజాలు తీసేస్తార‌ట‌.. హ్యాపీ న్యూస్ కాదు!
X
కొన్ని లెక్క‌లు ఎప్ప‌టికి అర్థం కావు. పబ్లిక్.. ప్రైవేటు భాగ‌స్వామ్యంతో అభివృద్ధి ప‌రిచిన ర‌హ‌దారుల మీద ప్ర‌యాణానికి టోల్ ట్యాక్స్ పేరుతో భారీగా వ‌సూలు చేయ‌టం తెలిసిందే. మొత్తంగా వ‌స్తున్న ఆదాయం ఎంత‌? ఆ ప్రాజెక్టుకు చేసిన ఖ‌ర్చు ఎంత‌? స‌ద‌రు టోల్ ట్యాక్స్ ప్ర‌జ‌లు ఎన్నేళ్ల పాటు క‌ట్టాలి? లాంటి లెక్క‌లు ఒక ప‌ట్టాన అర్థం కావు. అదే స‌మ‌యంలో వాటికి సంబంధించిన వివ‌రాలు ప్ర‌భుత్వాలు త‌మ‌కు తాము వెల్ల‌డించ‌వు కూడా.

దీనికి త‌గ్గ‌ట్లే ప్ర‌జ‌లు సైతం టోల్ ట్యాక్స్ క‌ట్టే వేళ‌లో మాత్రం ఫీల్ అవుతారే త‌ప్పించి.. విడి వేళ‌ల్లో మాత్రం ఆ ఊసు ప‌ట్ట‌దు. ఇక‌.. పండ‌గ‌లు.. వ‌రుస సెల‌వులు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం టోల్ ప్లాజాల వ‌ద్ద భారీగా ట్రాఫిక్ జాం కావ‌టం.. గంట‌ల కొద్దీ టైం అక్క‌డే వృధా కావ‌టం జ‌రుగుతుంది. అలాంటివేళ‌లో మాత్రం మరోసారి ప్ర‌భుత్వాన్ని తిట్టుకోవ‌టం అంద‌రూ చేసే ప‌ని.

త‌ర‌చూ టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర వాహ‌నాలు ఆగిపోవ‌టం.. దీని కార‌ణంగా ట్రాఫిక్ జాంతో పాటు.. పెద్ద ఎత్తున టైం వేస్ట్ అవుతున్న వైనాన్ని గుర్తించిన కేంద్రం కొత్త విధానంపై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ విధానం అమ‌ల్లోకి వ‌స్తే.. దేశంలో మ‌రెక్క‌డా టోల్ ఫ్లాజాలు ఉండ‌వు. మ‌రి.. అలాంటివేళ‌లో ప్ర‌జ‌ల నుంచి పిండేయ‌టం ఎలా అంటారా? దానికి కొత్త‌త‌ర‌హా టెక్నాల‌జీని వాడాల‌న్న యోచ‌న‌లో కేంద్రం ఉంది.

టోల్ ప్లాజాల‌ను ద‌శ‌ల వారీగా ఎత్తి వేయాల‌ని.. అదే స‌మ‌యంలో టోల్ ట్యాక్స్ ల‌ను వ‌సూలు చేసేందుకు కొత్త విధానాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌తి వాహ‌నంలోనూ ఆన్-బోర్డ్ యూనిట్ ప‌రిక‌రాన్ని అమ‌రుస్తారు. నిర్ణీత టోల్ ట్యాక్స్ జోన్ లో మీరు ప్ర‌యాణించినంత‌నే.. ఆ స‌మాచారాన్ని సెంట్ర‌ల్ స‌ర్వ‌ర్ కు అందుతుంది. మీ వాహ‌నంలో ఏర్పాటు చేసిన ప‌రిక‌రం ద్వారా మీ ప్ర‌యాణం ముగిసినంత‌నే ఆ విష‌యాన్ని గుర్తించి.. మీ అకౌంట్లో ఉన్న మొత్తంలో టోల్ ట్యాక్స్ మొత్తాన్ని జ‌మ చేసుకునే విధానానికి తెర తీస్తున్నారు. ప్ర‌యోగాత్మ‌కంగా మొద‌ట‌గా ఢిల్లీ-ముంబ‌యి హైవేల‌లోని టోల్ ప్లాజా స్థానంలో ఏర్పాటు చేస్తారు. అనుకున్న‌ట్లుగా స‌క్సెస్ అయితే.. ఇదే విధానాన్ని దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని కేంద్రం భావిస్తోంది. టోల్ ఫ్లాజాలు లేకున్నా.. టోల్ ట్యాక్స్ వ‌సూళ్లు మాత్రం క‌నుచూపు మేర ఆగే సూచ‌న‌లు క‌నిపించ‌టం లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.