Begin typing your search above and press return to search.

జగన్‌.. కోడికత్తి కేసులో ఎన్‌ఏఐ కౌంటర్‌ లో కీలక అంశాలివే!

By:  Tupaki Desk   |   13 April 2023 3:26 PM GMT
జగన్‌.. కోడికత్తి కేసులో ఎన్‌ఏఐ కౌంటర్‌ లో కీలక అంశాలివే!
X
2018లో విశాఖ విమానాశ్రయంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పై కోడి కత్తితో దాడి చేసిన ఘటనకు సంబంధించి నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎన్‌ఐఏ) కీలక కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ కోడి కత్తి కేసులో కుట్ర కోణం లేదని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ విజయవాడ కోర్టులో ఎన్‌ఐఏ తాజాగా కౌంటరు దాఖలు చేసింది.

ఇటీవల ఏపీ సీఎం జగన్‌ ను విచారణకు రావాలని విజయవాడ కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తానొస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతాయని.. జనజీవనానికి సమస్యలు తలెత్తుతాయని జగన్‌ తన పిటిషన్‌ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్‌ఐఏ తనపై హత్యాయత్నానికి సంబంధించి కుట్ర కోణాన్ని వెలుగులోకి తేలేదని.. కుట్ర కోణాన్ని దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్‌ కోరారు.

ఈ నేపథ్యంలో కోడికత్తి కేసులో కుట్రకోణం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు జరపాలంటూ సీఎం జగన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై విజయవాడ కోర్టులో ఎన్‌ఐఏ కౌంటర్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు అంశాలను తన కౌంటరులో పేర్కొంది.

విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనకు అక్కడి రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌ కు సంబంధం లేదని కౌంటర్‌లో ఎన్‌ఐఏ విజయవాడ కోర్టుకు నివేదించింది. అలాగే ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు టీడీపీ సానుభూతిపరుడు కాదని తేల్చిచెప్పింది.

కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్‌ వేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి చేసింది. మరోవైపు తమ వైపు వాదనలకు సమయం కావాలని సీఎం జగన్‌ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్‌ 17కి వాయిదా వేసింది.

తమ వైపు వాదనలకు రెండు రోజుల సమయం కావాలని జగన్‌ తరపు లాయర్‌ ఇంకొల్లు వెంకటేశ్వర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసు విచారణను ఏప్రిల్‌ 17కు వాయిదా వేశారు. 17న వాదనలు చెప్పాలని... అదే రోజు తీర్పు ఇవ్వనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. కాగా.. వాయిదాలు ఇవ్వద్దు అంటూ నిందితుడి తరపు న్యాయవాది అభ్యర్థించారు. అయితే ఈ నెల 17కే కదా వాయిదా వేసింది అని న్యాయమూర్తి సమాధానం ఇచ్చారు.