Begin typing your search above and press return to search.

టీడీపీ స‌రికొత్త రికార్డు.. 14వ సారి.. ఏం జ‌రిగిందంటే!

By:  Tupaki Desk   |   28 May 2023 8:14 AM
టీడీపీ స‌రికొత్త రికార్డు.. 14వ సారి.. ఏం జ‌రిగిందంటే!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌రికొత్త రికార్డును న‌మోదు చేసింది. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకీ ద‌క్క‌ని స‌ముత్త‌ర గౌర‌వం దక్కించు కుంది. వ‌రుస‌గా 14వ సారి.. టీడీపీ అధ్య‌క్షులుగా చంద్ర‌బాబునాయుడు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇది దేశంలోని ఏ ఇత‌ర ప్రాంతీయ పార్టీల‌కూ ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌లేదు. త‌న జీవిత కాలం అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్ప‌టికీ.. త‌మిళ‌నాడు అధికార పార్టీ డీఎంకేలో దివంగ‌త క‌రుణానిధి ఏ నాడూ ఎన్నిక‌లు పెట్ట‌లేదు. ఇక‌, పురుట్చిత‌లైవి, మాజీ సీఎం దివంగ‌త జ‌య‌ల‌లిత కూడా ఎన్నిక లేకుండానే అధ్య‌క్షురాలిగా సాగారు. ఒక‌టి రెండు సార్లు మాత్ర‌మే ఎన్నిక‌లు పెట్టారు.

ఇక‌.. పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌లో ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌(జ‌న‌తాద‌ళ్ ఎస్‌) ఇద్ద‌రు అధ్య‌క్షులు ఉన్నారు. దేవెగౌడ‌, ఆయ‌న కుమారుడు కుమార‌స్వామిలు అధ్య‌క్షులుగా ప‌నిచేశారు. యూపీలో ప్రాంతీయ పార్టీ స‌మాజ్‌వాదీకి కూడా దివంగ‌త ములా యం, ఆయ‌న కుమారుడు అఖిలేష్ యాద‌వ్‌లు ఉన్నారు. ఒడిసా అధికార్టీ బిజు జ‌న‌తాద‌ళ్‌కు ఎన్నిక‌లు లేకుండానే సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కొన‌సాగుతున్నారు. కానీ, ప్ర‌తి రెండేళ్ల‌కు(క‌రోనా టైం త‌ప్ప‌) ఒక‌సారి య‌థావిథిగా ఎన్నిక‌లు నిర్వ‌హిస్తూ.. అధ్య‌క్షుడిని ఎన్నుకుంటున్న ఏకైక ప్రాంతీయ పార్టీ టీడీపీనే.

మొత్తం 11 నామినేష‌న్లు..!

ఈ క్ర‌మంలో తాజాగా మహానాడులో 14వ సారి టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా నారా చంద్రబాబునాయుడు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. అనంత‌రం చంద్రబాబు ప్రమాణం చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబును అభినందించారు. చంద్రబాబుకు మద్దతుగా 11 నామినేషన్లు వచ్చాయి. కమిటీల ఏర్పాటుకు చంద్రబాబుకే సర్వాధికారాలు ఇచ్చారు. జాతీయ పార్టీ అధ్యక్షునిగా చంద్రబాబుతో ఎన్నికల కమిటీ కన్వీనర్ కాల్వ శ్రీనివాస్ ప్రమాణం చేయించారు.

మొత్తం 11 నామినేషన్లు వచ్చాయని చెప్పారు. అన్ని నామినేషన్లు కూడా చంద్రబాబునాయుడును అధ్యక్షుడిగా బలపరుస్తూ దాఖలు అయ్యాయని, దీంతో నారా చంద్రబాబునాయుడును 14వ సారి పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేశామని కాల్వ శ్రీనివాస్ తెలిపారు.