Begin typing your search above and press return to search.

చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అదే హామీని నొక్కి చెబుతున్నారుగా!

By:  Tupaki Desk   |   15 Jun 2023 4:40 PM IST
చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అదే హామీని నొక్కి చెబుతున్నారుగా!
X
మహానాడు తర్వాత నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు తాను పర్యటించే ప్రాంతాలకు వెళ్లిన ప్రతి చోట రెండు హామీల ప్రస్తావన పదే పదే ప్రస్తావిస్తున్న వైనం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఫ్లాగ్ షిప్ పథకాలన్నట్లుగా చంద్రబాబు వాటికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పాలి. ఇటీవల వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన హామీల్లో ముఖ్యమైనవి రెండు. అందులో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. రెండోది ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ రెండింటిని చంద్రబాబు పదే పదే ప్రస్తావిస్తున్నారు.

అయితే.. ఈ హామీ అమలు విషయంలో ఒక చిక్కు ఉంది. అదేమంటే.. కర్ణాటకలో అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ఒక క్లాజ్ ఉంది. అదేమంటే.. ఎవరైనా సరే మొదటి 20కి.మీ. ప్రయాణానికి మాత్రమే ఉచితం. ఆ తర్వాత కచ్చితంగా టికెట్ తీసుకోవాల్సిందే. అంటే.. 20కి.మీ. పరిమితి వరకు ఉచిత ప్రయాణం.. ఆ తర్వాత టికెట్ చెల్లింపులు తప్పనిసరి. ఈ విషయం తెలిసిన కన్నడ మహిళలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.మరి.. ఈ గుట్టు తెలిసే చంద్రబాబు హామీ ఇస్తున్నారా? లేదంటే.. మిగిలినవారి మాదిరి అవగాహన లేకుండా ఇస్తున్నారా? అన్నది ప్రశ్న.

ఒకవేళ అవగాహన లేకుండా ఉన్నట్లైయితే.. రేపొద్దున రాజకీయ ప్రత్యర్థులు ఉచిత ప్రయాణం అంటూ బాబు చెప్పే మాటల్లో డొల్లతనాన్ని కర్ణాటకను సాక్ష్యంగా చూపిస్తే.. రివర్స్ కావటం ఖాయమంటున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్న హామీ ఇవ్వటం సరే.. దాని మీద మరింత క్లారిటీ తెచ్చుకోవటం చంద్రబాబుకు తక్షణ అవసరమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు.. మరోసారి తన పాత హామీల్ని ప్రస్తావించారు. ఈసారి టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే సమయంలో.. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. జగన్ ప్రభుత్వంలో కుప్పం డెవలప్ మెంట్ అస్సలు జరగలేదన్నారు.

అదే సమయంలో తాము అధికారంలో ఉన్న సమయంలో పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనతగా పేర్కొన్నారు. కానీ.. కుప్పం మీద వైసీపీ సర్కారు పగబట్టిందని.. నాలుగేళ్లలో కుప్పంలో ఏ ఒక్క పని చేయలేదన్న ఆయన.. 'కుప్పంను వైసీపీ నేతలు దోచుకుంటున్నారు. ఆ దొంగలను తరిమికొట్టాల్సిన బాధ్యత ప్రజలదే. అధికారంలోకి రాగానే పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం. తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు'' అంటూ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ప్రసంగాల్ని చూస్తుంటే.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం మీదా.. మూడు గ్యాస్ బండల మీద ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది.