Begin typing your search above and press return to search.

బీచ్ లో చెత్త ఏరే వేళ.. మోడీ చేతిలో ఉన్నదేంటి?

By:  Tupaki Desk   |   13 Oct 2019 10:07 AM GMT
బీచ్ లో చెత్త ఏరే వేళ.. మోడీ చేతిలో ఉన్నదేంటి?
X
తాను చేసే పనులతో తరచూ దేశ ప్రజల అభిమానాన్ని అంతకంతకూ పెంచుకునే ప్రధాని మోడీ తాజాగా మహాబలిపురంలో చైనా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా తన ఇమేజ్ ను భారీగా పెంచేసుకోవటం తెలిసిందే. తొలిరోజు తమిళుల స్టైల్లో పంచె.. హాఫ్ హ్యాండ్ షర్ట్ తో పాటు.. భుజానికి కండువా వేసుకోవటం ద్వారా చర్చనీయాంశంగా మారిన ఆయన.. తర్వాతి రోజు ఉదయాన్నే బీచ్ లో చెత్త ఏరి సంచలనంగా మారారు.

తాను బస చేసిన హోటల్ కు సమీపంలోని బీచ్ లో ఉదయాన్నే వాకింగ్ కు వచ్చిన ఆయన పనిలో పనిగా చెత్త ఏరారు. అదే సమయంలో ఒక చేతిలో ఉన్న పరికరం మీద అందరిలోనూ ఆసక్తి వ్యక్తమైంది. చూసేందుకు ప్లాస్టిక్ స్టిక్ లా.. డంబెల్ మాదిరి ఉన్న ఆ పరికరం ఏమిటి? ఎందుకు మోడీ దాన్ని పట్టుకున్నారన్న చర్చ జరిగింది.

తన సన్నిహితులు పలువురు ఇదే విషయాన్ని తనను అడిగినట్లు చెప్పిన మోడీ.. తాను పట్టుకున్న పరికరం వివరాల్ని రివీల్ చేశారు. తాను పట్టుకున్నది అక్యుప్రెజర్ రోలర్ అని.. అరచేతిలో ఇమిడే ఆ పరికరం తనకెంతో మేలు చేస్తుందన్నారు. ఉదయాన్నే నడక సమయంలో ఈ పరికరాన్ని ఉపయోగించటం వల్ల రక్త ప్రసరణ మెరుగు పడటమే కాదు.. ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుందన్నారు.

అత్యుత్సాహం లాంటి ప్రతికూల ఉద్వేగాల్ని కూడా నియంత్రిస్తుందని చెప్పిన ఆయన.. నిద్ర లేమి సమస్యతో బాధ పడే వారికి సైతం సాయంగా నిలుస్తుందని చెప్పారు. జీర్ణ సంబంధిత వ్యాధులు.. తలనొప్పి లాంటి సమస్యలకు ఇదో పరిష్కారంగా చెప్పిన తీరు చూస్తే.. ఈ అక్యుప్రెజర్ రోలర్ కు ఫుల్ డిమాండ్ ఖాయమని చెప్పక తప్పదు. రానున్న రోజుల్లో ఉదయాన్నే వాకింగ్ కు బయలుదేరే వారి చేతుల్లో ఇలాంటి రోలర్లు దర్శనమివ్వటం ఖాయమేమో?