Begin typing your search above and press return to search.

చైనా ఆ పని చేసిందంటూ అమెరికా నిఘా సంస్థ సంచలనం

By:  Tupaki Desk   |   14 May 2020 6:45 AM GMT
చైనా ఆ పని చేసిందంటూ అమెరికా నిఘా సంస్థ సంచలనం
X
ప్రపంచమంతా ఆగమాగమవుతున్న వేళ.. అసలీ పాపానికి బాధ్యులు ఎవరన్నది ప్రశ్నగా మారింది. అగ్రరాజ్యం అమెరికా మొదలు అన్ని దేశాలు చైనా వైపు వేలు చూపిస్తున్న వేళ.. డ్రాగన్ దేశం మాత్రం తనకే పాపం తెలీదని.. తాను సుద్దపూసనని అదేపనిగా చెప్పటం తెలిసిందే. ఇలాంటివేళ.. న్యూస్ వీక్ మీడియా సంస్థ తాజాగా షాకింగ్ కథనాన్ని అచ్చేసింది. ఇప్పుడా ప్రత్యేక కథనం ప్రపంచానికి షాకింగ్ గా మారింది.

కరోనా విషయంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయకుండా.. ప్రపంచ ఆరోగ్య సంస్థను చైనా నిలువరించినట్లుగా అమెరికా నిఘా సంస్థ తన నివేదికలో పేర్కొన్నట్లుగా న్యూస్ వీక్ వెల్లడించింది. వైరస్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యయిక పరిస్థితిని ప్రకటిస్తే.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు తాము అందించే సహకారాన్ని తాము నిలిపివేస్తామని డ్రాగన్ దేశం బెదిరించినట్లుగా అమెరికా నిఘా వర్గాలు తమ అంతర్గత నివేదికలో పేర్కొన్నట్లుగా సదరు మీడియా సంస్థ పేర్కొంది.

జనవరిలో భారీ ఎత్తున మాయదారి రోగం చైనాను చుట్టేస్తున్న వేళ.. ఆ విషయాన్ని ప్రపంచానికి అర్థమయ్యేలా హెచ్చరించటంలో డబ్ల్యూహెచ్ వో ఫెయిల్ అయినట్లుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదే పనిగా ఆరోపించటాన్ని మర్చిపోకూడదు. మాయదారి రోగానికి చైనానే కారణమని.. ఆ బాధ్యతను తీసుకోవాలంటూ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్న వేళలోనే.. ఆ వాదనకు బలం చేకూరేలా న్యూస్ వీక్ కథనం బయటకు రావటం సంచలనంగా మారింది. మరి..దీనిపై డ్రాగన్ దేశం ఎలా రియాక్టు అవుతుందో?