Begin typing your search above and press return to search.

రాత్రివేళ ఆపరేషన్ చబుత్రా.. 300 మంది దొరికేశారట

By:  Tupaki Desk   |   13 Jun 2021 5:30 AM GMT
రాత్రివేళ ఆపరేషన్ చబుత్రా.. 300 మంది దొరికేశారట
X
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ను కొందరు లైట్ తీసుకోవటం తరచూ కనిపిస్తూ ఉంటుంది. ప్రధాన రహదారుల్లోకి వస్తే పోలీసులు ప్రశ్నించే ప్రమాదం ఉండటంతో.. అందుకు భిన్నంగా వీదుల్లో.. కాలనీల్లో.. బస్తీల్లో తిరగటం ఎక్కువైంది. ఎంత చెప్పినా వినకుండా బయటకు వస్తున్న వారికి చెక్ చెప్పేందుకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ‘ఆపరేషన్ చబుత్రా’ కార్యక్రమానికి తెర తీశారు.

ఇంతకీ ఆపరేషన్ చబుత్రా అంటే ఏమిటన్న సందేహం రావొచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఆకస్మికంగా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వీధుల్లో తిరిగే వారిని అదుపులోకి తీసుకుంటారు. ప్రధాన రహదారులతో పాటు.. వీధుల్లో కూడా తిరగకూడదన్న సంగతి తెలిసిందే. అందుకు భిన్నంగా తమను ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశంతో చాలామంది బయట తిరుగుతుంటారు. ఇలాంటి వారిని అదుపులోకి తీసుకొని ఫైన్లు వేయటం.. అవసరమైతే కేసులు పెట్టటమే ఈ ఆపరేషన్ లక్ష్యం. లాక్ డౌన్ వేళ.. అందరూ ఇళ్లకే పరిమితం కావాలే కానీ వీధుల్లో తిరగకూడదన్నదే లక్ష్యం.

తాజాగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో రాత్రి వేళ ఆపరేషన్ చబుత్రాను నిర్వహించారు. ఎల్బీ నగర్.. మీర్ పేట.. బాలాపూర్ ప్రాంతాల్లో ఆకస్మికంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది యువకులు నిబంధనలకు విరుద్ధంగా రోడ్ల మీద కనిపించారు. వారందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని భౌతిక దూరాన్ని పాటించేలా కూర్చోబెట్టి.. వారి తల్లిదండ్రుల్ని పిలిపించారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇదే తీరులో మరోసారి దొరికితే వారిపై విపత్తు నివారణ చట్టం కింద కేసు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. మొదటి తప్పు కింద వారికి రూ.వెయ్యి ఫైన్ వేసి పంపారు. రానున్న రోజుల్లో మరిన్ని కాలనీల్లో.. బస్తీల్లో ఇదే తరహా కార్యాక్రమాన్ని చేపట్టనున్నట్లు చెబుతున్నారు. రాచకొండ సీపీ చేపట్టిన ఆపరేషన్ చబుత్రాను హైదరాబాద్.. సైబరాబాద్ కమిషనరేట్లలోనూ నిర్వహించేందుకు వీలుగా ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ.. ఇళ్లకు పరిమితం కాకుండా వీధుల్లో తిరిగే అలవాటు ఉన్న వారు జర జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకుంటే అడ్డంగా బుక్ కావటం ఖాయం.