Begin typing your search above and press return to search.

మోడీ.. యోగి ఎవరు గొప్ప? ఒక నిండు ప్రాణం బలి

By:  Tupaki Desk   |   13 Jun 2023 10:00 AM GMT
మోడీ.. యోగి ఎవరు గొప్ప? ఒక నిండు ప్రాణం బలి
X
అభిమానానికి హద్దు ఉండాలి.కానీ.. అందుకు భిన్నంగా తాము అభిమానించే వారి విషయంలో దురభిమానాన్ని ప్రదర్శించే ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. అలాంటి తీరు ఒక షాకింగ్ పరిణామానికి కారణం కావటం గమనార్హం. అధికార పార్టీగా.. తిరుగులేని ప్రజాభిమానం ఉన్న ఇద్దరు ముఖ్యనేతలకు సంబంధించి.. వారిద్దరిలో ఎవరు గొప్ప? అన్న విషయంపై మొదలైన చర్చ.. రచ్చగా మారటమేకాదు.. చివరకు ఒక ప్రాణం పోయేలా మారటంషాకింగ్ గా మారింది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. బీజేపీకి చెందిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇద్దరిలో ఎవరు గొప్ప? అన్న చర్చ మొదలై.. కాసేపటికే అదికాస్తా పెద్ద గొడవకు దారి తీసిన ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. కోలాహి గ్రామానికి చెందిన 50 ఏళ్ల రాజేశ్ ధార్ దూబే తన సోదరుడి కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు మీర్జాపూర్ వెళ్లారు. ఆ తర్వాత తిరిగి కారులో తన సొంతూరు కోలాహికి బయలుదేరారు.

ఇక్కడి వరకు అంతా బాగానే జరిగింది. కారులో ప్రయాణించే సమయంలో టైంపాస్ కోసం డ్రైవర్ తో మాట్లాడటం తెలిసిందే. అలానే.. రాజేశ్ సైతం చర్చ మొదలుపెట్టాడు. ప్రధానమంత్రి మోడీ.. యూపీ సీఎం యోగి.. ఇద్దరిలో ఎవరు గొప్ప? అన్న అంశంపై చర్చను తెచ్చారు. కాసేపటికే ఇరువురి చర్చ కాస్తా.. వాదనగా మారింది. ఇరువురు మధ్య మాటా మాటా పెరడటంతో ఆగ్రహానికి గురైన డ్రైవర్ రాజేశ్ ను కారు నుంచి బయటకు దించేశాడు.

దీంతో.. తనను దించేసి ఎలా ముందుకు వెళతావో చూస్తానంటూ రాజేశ్ కారుకు అడ్డంగా నిలబడ్డాడు. అయితే.. ఈ తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన డ్రైవర్.. రాజేశ్ మీదుగా కారును పోనిచ్చాడు. దీంతో.. రాజేశ్ దూబే అక్కడికక్కడే మరణించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రాజేశ్ బంధువులు మిర్జాపూర్ - ప్రయాగ్ రాజ్ రహదారిని దిగ్బంధించారు. దీంతో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చి.. ఆందోళన చేస్తున్న రాజేశ్ బంధువులను సముదాయించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల్లో ఎవరు గొప్ప? అన్న చర్చ ఒక నిండు ప్రాణాన్ని తీయటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.