Begin typing your search above and press return to search.

ఇందిరమ్మే వందనం చేసిన పూసపాటి వైభవం.

By:  Tupaki Desk   |   2 May 2022 12:30 AM GMT
ఇందిరమ్మే వందనం చేసిన పూసపాటి వైభవం.
X
విజయనగరం జిల్లాకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. పూసపాటి రాజులు వందల ఏళ్ళుగా ఇక్కడ సంస్థానాలను ఏర్పాటు చేసుకుని జనాలను పాలించారు. ఇక రాచరికం పోయి ఆధునిక వ్యవస్థ వచ్చిన తరువాత కూడా దానిని గౌరవిస్తూ చట్ట సభల ద్వారా నెగ్గి తమ సత్తా చాటుకున్న చరిత్ర కూడా పూసపాటి వారిదే. అలాంటి వంశీకులులో రాజకీయంగా రాణించిన తొలి తరం వారు పీవీజీ రాజు. ఆయన తన ఆస్తులను మొత్తం ప్రజలకు దారాదత్తం చేశారు. ఎన్నో సామాజిక హితమైన కార్యక్రమాలకు వాటిని వెచ్చించి అందరి బాగు కోరుకున్నారు.

ఆయన సోషలిస్ట్ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తరువాత కాలంలో ఆయన కాంగ్రెస్ లో చేరి పలుమార్లు ఎంపీ అయ్యారు. ఇక ఆయన వస్తూంటే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎదురేగి తల వంచి మరీ వందనం చేయడం చరిత్ర మరచిపోదు. అది ఆయనకూ, ఆయన వంశానికి ఉన్న గౌరవంగా అంతా చెప్పుకుంటారు.

ఆయన వారసులుగా కుమారులు ఆనందగజపతిరాజు, అశోక్ గజపతి రాజు రాజకీయాల్లో రాణించారు. ఇవన్నీ ఇలా ఉంటే అశోక్ గజపతిరాజుని అకస్మాత్తుగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పదవి నుంచి తప్పించడం, సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా కూడా పక్కన పెట్టడం ఈ మధ్య జరిగిన పరిణామాలు. అంతే కాదు ఆయనను పట్టుకుని వైసీపీ మంత్రులు ఎన్నో విధాలుగా నిందించారు.

ఇక మాన్సాస్ ట్రస్ట్ ద్వారా నడిచే విద్యా సంస్థలను ఇబ్బంది పెట్టడం, ఎంతో మందికి విద్యా దానం చేసిన ఎమ్మార్ కాలేజీని నాన్ ఎయిడెడ్ గా చేసి ప్రైవేట్ పరం చేయడం వంటివి ఈ మధ్యనే జరిగాయి. ఇక తనను ప్రభుత్వ పెద్దలు అవమానించారని పలు మార్లు అశోక్ మీడియా ముందు ఆవేదన చెందిన సందర్భాన్ని అంతా చూశారు. తాను చైర్మన్ గా ఉన్న రామతీర్ధం దేవాలయానికి లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వబోతే సర్కార్ పెద్దలు కాదని పక్కన పెట్టారని కూడా ఆయన కలత చెందారు.

తన మీద కేసులు పెట్టాలని చూస్తున్నారని కూడా పీవీజీ రాజు కుమారుడు అశోక్ బాధపడడం కూడా నడుస్తున్న చరిత్ర. మరి దేశానికి అత్యంత శక్తివంతురాలు అయిన మహిళగా ఉన్న ఇందిరాగాంధీ పూసపాటి వంశీకులను గౌరవించడం నిన్నటి చరిత్ర అయితే వారి మీద నోరు పారేసుకుని నానా విధాలుగా అవమానించడం నేటి పాలకుల దుర్నీతి అని చెబుతున్నారు. ఇలా అన్నీ చూసిన విజయనగరం జనాలు ఆవేదన చెందుతున్నారు.

ఇదంతా ఎందుకంటే మే 1 పీవీజీ రాజు జయంతి. ఆయన 1924 మే 1న జన్మించారు. 1995 నవంబర్ 14న 71 ఏళ్ల వయసులో తనువు చాలించారు. ఆయన నెలకొల్పించే మాన్సాస్ సంస్థ. మరి ఆ మహానుభావుడు జయంతి వేళ మాన్సాస్ మీద ఈ మధ్య కాలంలో జరిగిన దాడులను తలచుకుని అభిమాన జనం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. మన్నించు మహరాజా అంటున్నారు. రాజులే పోయినా రాజ్యాలు కూలినా నీ కోట వైభవం మాత్రం అలాగే ఉంటుంది. ప్రస్తుతం జరిగేవన్నీ తాత్కాలికమే సుమా అని వారికి వారే ఓదార్చుకుంటూ పీవీజీ రాజుకు ఘన నివాళి అర్పిస్తున్నారు.