Begin typing your search above and press return to search.
తాడేపల్లిగూడెంలో పవన్ విగ్రహం..వైరల్!
By: Tupaki Desk | 26 April 2018 11:25 AM GMTదక్షిణాదిలో సినీతారలను డెమీగాడ్ లు గా కొలుస్తూ వారి కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం...వారిపేరిట అన్నదానాలు చేయడం సర్వసాధారణం. మరికొంతమంది హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే...ఏకంగా వారికి గుళ్లు కట్టించిన సందర్భాలూ ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎక్కువగా ఈ తరమా గుళ్లు దర్శనమిస్తాయి. తమిళనాడులో మాజీ సీఎం కరుణానిధి, ఎంజీఆర్, ఖుష్బూ, నగ్మా, నమిత, కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్, కోల్ కతాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ , ఏపీలోని చిత్తూరులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్, నెల్లూరులో మమతాకులకర్ణి...వీరందరికీ వారి వారి వీరాభిమానులు గుళ్లు కట్టేశారు. అదే తరహాలో జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ కు శ్రీకాకుళంలో గుడి కట్టాలని పవన్ వీరాభిమాని షకలక శంకర్ గతంలో ప్రకటించాడు. అయితే, సరైన స్థలం దొరక్కపోవడంతో ఆ కార్యక్రమం లేట్ అవుతోందని టాక్. అయితే, తాజాగా - పవన్ నిలువెత్తు విగ్రహాన్ని ఓ వీరాభిమాని ప్రతిష్టించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం పవన్ విగ్రహం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
టాలీవుడ్ లో పవన్ కల్యాణ్ కు సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దాంతోపాటు జనసేనానికి కార్యకర్తల మద్దతు కూడా ఉంది. దీంతో, ఇరు తెలుగు రాష్ట్రాలలో పవన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ తో పవన్ డై హార్డ్ ఫ్యాన్ ఒకరు ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏడున్నర అడుగుల పవన్ విగ్రహాన్ని పవన్ వీరాభిమాని ఒకరు ఏర్పాటు చేశారు. నడుముకు ఎర్రతుండు కట్టుకొని పిడికిలి బిగించి నినదిస్తున్న పవన్ నిలువెత్తు విగ్రహం ఆ ప్రాంతంలో ప్రత్యేకాకర్షణగా నిలిచింది. ఈ తరం టాలీవుడ్ హీరోలలో తొలి విగ్రహం పవన్ దే కావడం విశేషం. షకలక శంకర్ కూడా త్వరలోనే మంచి స్థలం దొరికితే పవన్ కు గుడి కట్టాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే గనక జరిగితే...అన్నగారి తర్వాత ఆ అరుదైన గౌరవం దక్కించుకున్న హీరోగా పవన్ ఖ్యాతి పొందుతారు.