Begin typing your search above and press return to search.

పట్టాభి కంటే పయ్యావుల బెటర్.. టీడీపీ నేతల మనోగతం

By:  Tupaki Desk   |   12 Nov 2021 3:30 PM GMT
పట్టాభి కంటే పయ్యావుల బెటర్.. టీడీపీ నేతల మనోగతం
X
పట్టాభి..కొద్ది రోజుల క్రితం వరకూ ప్రజల నోళ్లలో నానిన పేరిది. ముఖ్యమంత్రిపై నోరుజారారన్న ఆరోపణతో జైలు కెళ్లిన ఆయన బెయిల్‌పై బయకొచ్చి. ప్రస్తుతం నిత్యం ప్రెస్ మీట్‌లు పెడుతూ తెగ హడావుడి చేస్తున్నారు. తానిక తగ్గేదే లేదన్నట్టు హల్‌చల్ చేస్తున్నారు. అయితే..ఈ అతి చేష్టలు పార్టీకి చేటు తెచ్చేలా ఉన్నాయని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఈయన కంటే పయ్యావుల కేశవ్ బెటర్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకే ఒక మాటలో పట్టాభి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారు. ఆ తర్వాత అరెస్ట్, బెయిల్, విహార యాత్ర ముగించుకుని మళ్లీ మీడియా ముందుకు వస్తున్నారు. మొన్న పెట్రోల్ మంటలంటూ... నిన్న ఇసుక మాఫియా అంటూ మునుపటి లాగే ప్రభుత్వంపై చిందులేస్తున్నారు. అయితే పట్టాభి వ్యవహారశైలిపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తమ్ముళ్లు చెబుతున్నారు. సీనియర్లను కాదని తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి హాడావిడి చేయడం తప్పా.. ఆయన వల్ల ఉపయోగం లేదని తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. ఇది ఆ పార్టీలో ఎంతలా వెళ్లిందంటే... పార్టీ గొప్పదా.. వ్యక్తి గొప్పనా అనే చర్చ ప్రారంభమైందట. ఇందుకు కారణం కూడా తమ్ముళ్లు చెబుతున్నారు. పట్టాభి అరెస్ట్ తర్వాత మీడియాకు ముందుకు వచ్చిన నేనే గొప్ప అనే విధంగా మీడియాలో ఫోజ్ ఇచ్చారని చెబుతున్నారు. పార్టీ గురించి కార్యకర్తల గురించి ప్రస్తావించినప్పటికీ.. నేను.. నేను అనే మాట ముందు అవన్నీ తేలిపోయాయని వాపోతున్నారు.

పట్టాభి వ్యాఖ్యలు విన్న తర్వాత ప్రభుత్వాన్ని ఆయన తప్ప.. పార్టీలో ఇంకెవరూ విమర్శించ లేరా అనే ప్రశ్నలు టీడీపీలో మొదలయ్యాయని చెబుతున్నారు. ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం వల్ల ఉపయోగం లేదని అంటుంన్నారు. ప్రజల్లో పనిచేసినప్పుడే గౌరవం పెరుగుతుందని టీడీపీ తమ్ముళ్లు స్వరం పెంచుతున్నారు. అంతిమంగా రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టమేనని హెచ్చరిస్తున్నారు. రెచ్చగొట్టే మార్గాల వల్ల ప్రజలకు చేరువ కాలేమని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తిగత దూషణలు చేయడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత రాదని, అంతిమంగా పార్టీకి ఇబ్బందేనని స్పష్టం చేస్తున్నారు. కష్టాల్లోనూ పార్టీ నిలబడిందంటే వ్యక్తుల వల్ల కాదని అది కార్యకర్తల వల్లేనని తేల్చిచెబుతున్నారు.

పట్టాభి తరహాలో కాకుండా అప్పుడప్పుడూ మీడియా ముందు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని పయ్యావుల కేశవ్ కదిలిస్తున్నారని టీడీపీ నేతలు కొనియాడుతున్నారు. సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ జగన్ ను కార్నర్ చేస్తున్నారని గుర్తుచేస్తున్నారు. అసలు ప్రభుత్వాన్ని కదిలించేలా పట్టాభి మీడియా సమావేశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారట. ఈ రెండున్నరేళ్లలో పట్టాభి ప్రభుత్వాన్ని కదిలించే ఒక్క మీడియా సమావేశం లేదని విమర్శిస్తున్నారు. పైగా ఆయన వాడిన భాష వల్ల రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని చెబుతున్నారట. పార్టీ కంటే తానే ఎక్కువ అనే దోరణిలో పట్టాభి మాట్లాడడం టీడీపీలో రుచించండం లేదట. ఇటీవల పార్టీలో చేరి.. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీ రెడ్డి ఏ అంశంపై మాట్లాడారో అదే విషయాన్ని తిరిగి పట్టాభి మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీని వెనుక ఉన్న మర్మం ఏమిటో తమ్ముళ్లు అర్థం కావడం లేదట. మీడియాలో తప్ప ప్రజల్లో కనిపించని ఓ వర్గం ఆయను ప్రొత్సహిస్తోందనే చర్చ కూడా టీడీపీ సాగుతున్నట్లు సమాచారం. పార్టీని పట్టాభికే రాయించినట్లు అన్ని తానై మీడియా ముందు రావడంపై పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.