Begin typing your search above and press return to search.

స్థానిక ఉప ఎన్నికల్లో ఏకగ్రీవాలు.. వైసీపీ నేతలకే పదవులు

By:  Tupaki Desk   |   9 Jun 2023 2:21 PM IST
స్థానిక ఉప ఎన్నికల్లో ఏకగ్రీవాలు.. వైసీపీ నేతలకే పదవులు
X
షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు మరో తొమ్మిది నెలలు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి వేళలో.. ఏపీ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ.. పట్టణ.. స్థానిక సంస్థల్లోని ఖాళీలను భర్తీ చేసేందుు నిర్వహించిన ఉప ఎన్నికలు పూర్తి అయ్యాయి. గత నెల 31న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని జారీ చేసిన నోటిఫికేషన్ లో భాగంగా గురువారం ఏపీ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 11 గంటల వేళలో ఆయా స్థానిక ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాల్ని నిర్వహించి.. ఎన్నికల ప్రక్రియను పూర్తి చేశారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా గంటా పద్మశ్రీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన కవురు శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి రావటంతో జిల్లా పరిషత్ పీఠానికి ఖాళీ ఏర్పడింది. తాజాగా బీసీ మహిళ అయితే పద్మశ్రీకి పదవి వరించింది.

జిల్లా పరిషత్ ఏర్పడిన అనంతరం బీసీ మహిళగా చైర్ పర్సన్ గా ప్రమాణ స్వీకారం చేయటం ఇదే తొలిసారని చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు పురుపాలక సంఘం మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవికి 22వ వార్డు వైసీపీ కౌన్సిలర్ కొమ్మువెంకటేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్ పదవికి గత నెలలో షేక్ అమీరున్సీసాబేగం రాజీనామాతో ఈ ఎన్నిక జరిగింది.

పశ్చిమగోదావరిజిల్లా పెంటపాడు మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా వైసీపీ ఎంపీటీసీ ముప్పిడి సరోజిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ గా వైసీపీకి చెందిన బోడపాటి సుబ్బలక్ష్మీ.. వైస్ చైర్మన్ గా కోనేటి రామక్రిష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ 1 గా వైసీపీకి చెందిన ముచ్చు లయ యాదవ్ ఎన్నియ్యారు. విజయనగరం జిల్లా ఎల్. కోట మండల పరిషత్ రెండో వైస్ ఎంపీపీగా వైసీపీకి చెందిన భీమాళి ఎంపీటీసీగా మధునూరు శ్రీనివాసవర్మ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా పని చేసిన కుమారి మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.

గుంటూరు జిల్లా తెనాలి మున్సిపాలిటీకిసంబంధించి రెండో వైస్ ఛైర్ పర్సన్ గా 40వవార్డు వైసీపీ కౌన్సిలర్ అత్తోట నాగవేణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ ఛైర్ పర్సన్ గా కాచర్ల లక్ష్మీ ఎన్నికయ్యారు. స్థానిక సంస్థలకు సంబంధించి బత్తలపల్లి ఎంపీపీగా బగ్గిరి త్రివేణి.. చెన్నేకొత్తపల్లి వైస్ ఎంపీపీ 1గా రాములమ్మ ఎన్నికయ్యారు.

అనంతపురం జిల్లా విడపనకల్లు మండల ఉపాధ్యక్షురాలిగా పుష్పావతి ఎంపికయ్యారు. అన్నమయ్యయ జిల్లా గాలివీడు ఎంపీపీగా పద్మావతమ్మ ఎంపిక కాగా.. ఎంపీపీగా సుదర్శనరెడ్డిరాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తైంది. చిత్తూరు జిల్లా లోని మూడు మండలాల్లో ఖాళీగా ఉన్న ఎంపీపీ.. వైస్ ఎంపీపీ.. కోఆప్షన్ సబ్యుల ఎంపికతో పాటు విజపురం వైస్ ఎంపీపీ స్థానానికి జరగాల్సిన ఎన్నిక కోరం లేని కారణంగా వాయిదా పడ్డాయి.