Begin typing your search above and press return to search.

మోడీ పని అయిపోయింది ఇక్కడ.. చాలెంజ్ చేశాడు!

By:  Tupaki Desk   |   30 March 2021 11:30 AM GMT
మోడీ పని అయిపోయింది ఇక్కడ.. చాలెంజ్ చేశాడు!
X
బీజేపీ కాలు పెట్టిన జాగా ఆ పార్టీ వశం కావాల్సిందే. అంతలా బలం, బలగం ప్రయోగిస్తూ ఒక్కో రాష్ట్రాన్ని చేజిక్కించుకుంటోంది. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు దండయాత్ర చేసి మరీ రాష్ట్రాలను కైవసం చేసుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు అవకాశాలున్న ఒక్కో రాష్ట్రంపై గురిపెట్టి.. అక్కడి అధికార పార్టీ నేతలను లాగేసి అధికారం దిశగా సాగుతోంది. పశ్చిమబెంగాల్ లోనూ అదే ప్రయోగం చేసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది. ఈ బెంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీకి చుక్కులు చూపిస్తున్నారు.

అయితే బలమైన బీజేపీకి.. సీఎం మమత బెనర్జీ మధ్య ఒకరు ఉన్నారు. ఆయనే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. బీజేపీని గెలవనీయకుండా అడ్డంగా నిలబడ్డాడు. తన వ్యూహాలతో మమత బెనర్జీని గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. ఇటీవల బీజేపీ కార్యకర్తల దాడిలో మమత గాయపడిందని.. ఆమె కాలికి కట్టు కట్టించి మరీ ర్యాలీలు, సభల్లో చూపిస్తూ ప్రశాంత్ కిషోర్ చేస్తున్న రాజకీయానికి బీజేపీ బెంబెలేత్తిపోతోంది.

సొంత ఆడబిడ్డ మమత ముఖ్యమా? లేదా ఢిల్లీ నుంచి వచ్చిన బెంగాలీయేతరులు ముఖ్యమా అన్న ప్రశాంత్ కిషోర్ నినాదం బెంగాలీలను ఆలోచింపచేస్తోంది. పొరిగింటి పుల్లకూర చేదు అనేలా బీజేపీని బయటి పార్టీగా బెంగాల్ లో మమత ఫోకస్ చేస్తోంది.

ఈ క్రమంలోనే బీజేపీ గెలవదు అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన సవాల్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని తొడగొట్టారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ కి ఉన్న క్రేజ్ మోదీకి లేదని పీకే కుండబద్దలు కొట్టారు. ఇక్కడ ఎన్నికలు వన్ సైడ్ జరుగుతున్నాయని, మమత బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. ఇక్కడ పోటీ మమత బెనర్జీ, నరేంద్ర మోదీల మధ్యనే జరుగుతుందని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు.

ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అంతో ఇంతో బీజేపీకి పట్టు ఉన్నది బెంగాల్, అసోంలోనే. కానీ బెంగాల్ లో బలమైన మమతా బెనర్జీ ముందు బీజేపీ పప్పులు ఉడకడం లేదు. ఆమెకు అండగా ప్రశాంత్ కిషోర్ మంచి వ్యూహాలను అందిస్తూ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారాడు. ఇప్పుడు బెంగాల్ మోడీ పని అయిపోయిందని.. చాలెంజ్ కూడా చేశాడు. మరి ఫలితాల అనంతరం ఎవరి వాదన ఏంటనేది తేలనుంది.