Begin typing your search above and press return to search.

చెరువులో పూల‌తోట‌.. హైద‌రాబాద్‌ లోనే..!

By:  Tupaki Desk   |   29 Jan 2019 4:45 AM GMT
చెరువులో పూల‌తోట‌.. హైద‌రాబాద్‌ లోనే..!
X
చెరువు మ‌ధ్య‌లో క‌మ‌లాలు క‌నువిందు చేయ‌టం మామూలే. మ‌రి.. చెరువులో పూతోట సాధ్య‌మా? అంటే నో చెబుతారు. కానీ.. అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌తో దాన్ని నిజం చేశారు హైద‌రాబాద్ జేఎన్ టీయూకు చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ గిరిధ‌ర్‌. చెరువు మ‌ధ్య‌లో పెంచుతున్న ఈ పూలతోట ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు.. అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది. ఇంత‌కీ చెరువు మ‌ధ్య‌లో పూల‌తోట ఎక్క‌డ ఉంది? దాన్ని ఎలా పెంచుతున్నారు? అన్న అంశాల్లోకి వెలితే..

హైద‌రాబాద్ జేఎన్ టీయూ తెలుసుగా? అదేనండి.. కూక‌ట్ ప‌ల్లి హౌసింగ్ బోర్డు దాటిన త‌ర్వాత వ‌చ్చే స్టాపు. అక్క‌డకు కొంత దూరంలో ఉన్న అంబీర్ చెరువులో ఈ ప్ర‌యోగాన్ని చేప‌ట్టారు. ఎర్త్ వాచ్ ఫౌండేష‌న్ అనే సంస్థ సాయంతో జేఎన్ టీయూ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఎంవీ ఎస్ ఎస్ గిరిధ‌ర్ అనే ప్రొఫెస‌ర్ తోపాటు ఇద్ద‌రు రీసెర్చ్ స్కాల‌ర్స్.. ఒక ఎంటెక్ విద్యార్థుల బృందం గ‌త అక్టోబ‌రు నుంచి ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టారు.

చుట్టుప‌క్క‌ల కాల‌నీల క‌లుషిత నీరు పైపుల ద్వారా చెరువులోకి చేరుతుంది. దీంతో.. న‌త్ర‌జ‌ని.. పాస్పేట్ నిల్వ‌లు పెరిగి భ‌రించ‌లేని ఘాటు వాస‌న‌తో చెరువు ప‌రిస‌రాలు ఉంటాయి. ఈ నేప‌థ్యంలో న‌త్ర‌జ‌నిని గ్ర‌హించి వృద్ధి చెందే గోల్డెన్ రెడ్ క‌న్నా లిల్లీస్ అనే మొక్క‌ల పెంప‌కాన్ని చేప‌ట్టారు. ఈ మొక్క‌ల పుణ్య‌మా అని.. చెరువులోని న‌త్ర‌జ‌ని.. ఫాస్పేట్ నిల్వ‌లు త‌గ్గుతున్న‌ట్లు గుర్తించారు.

అంటే.. చెరువులోని న‌త్ర‌జ‌ని.. ఫాస్ప‌ర్ ను గ్ర‌హించి వృద్ధి చెందే మొక్క‌ల‌తో చెరువుకు కొత్త క‌ళ‌తో పాటు.. చూసే వారికి కొత్త అందాలు క‌నువిందు చేసే ప‌రిస్థితి. ప్ర‌స్తుతం ప‌రిమిత సైజులో పెంచుతున్న ఈ మొక్క‌ల్ని త్వ‌ర‌లో పెద్ద ఎత్తున వృద్ధి చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌ లోని క‌లుషిత‌మైన మిగిలిన చెరువుల్లోనూ ఈ త‌ర‌హా పూల‌తోట పెంచితే కొత్త అందాలు క‌నువిందు చేయ‌టం ప‌క్కా అని చెప్ప‌క త‌ప్ప‌దు.