Begin typing your search above and press return to search.

రాహుల్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాటుదేలిపోయాడు

By:  Tupaki Desk   |   1 Nov 2017 12:54 PM
రాహుల్ మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాటుదేలిపోయాడు
X
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రోజురోజుకీ రాటుదేలుతున్నారు. ముద్దపప్పు అన్న ముద్ర ఉన్న రాహుల్ గత కొన్నాళ్లుగా మాటల్లో ఆరితేరిపోయారు. మోడీకి ధీటుగా పంచ్ లు వేస్తూ ఎన్డీయే ప్రభుత్వాన్ని బాగానే ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఆయన మాటల్లోనే కాదు మార్షల్ ఆర్ట్స్ లోనూ సత్తా చాటుతున్నారు. జపాన్‌ యుద్ధ కళ అయికిడోలో బ్లాక్‌ బెల్ట్‌ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాహుల్‌ గాంధీ మార్షల్‌ ఆర్ట్‌ లో తన ప్రతిభ ప్రదర్శిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

నిజానికి రాహుల్ ఇంతకుముందే తనకు అయికిడో తెలుసని... తనకు బ్లాక్ బెల్ట్ ఉందని చెప్పినా చాలామంది నమ్మలేదు. లైట్ గా తీసుకున్నారు. అయితే... తాజాగా ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ ఫొటోలను రాహుల్ షేర్ చేయలేదు. ఆయనతో పాటు అయికిడో నేర్చుకున్న భరత్ అనే మరో వ్యక్తి వాటిని ట్విటర్ లో షేర్ చేశారు. వాటిని కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యతలు చూస్తున్న దివ్య స్పందన రీట్వీట్ చేయడంతో ఒక్కసారిగా అవి వెలుగులోకి వచ్చాయి. దాదాపుగా పది నెలల కిందటి ఫొటోలవి.

కాగా రాహుల్ గురించి భరత్ చాలా గొప్పగా చెప్తున్నారు. అయికిడో నేర్చుకున్నప్పుడు పరిచయం అయిన రాహుల్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ఆయన క్రమం తప్పకుండా సాధన చేసేవారని.. కానీ, తరగతి గదిలో చాలా మౌనంగా ఉండేవారని భరత్ చెప్పారు. కాగా రాహుల్ కు అయికిడోలో ప్రావీణ్యం ఉండడంతో పాటు రన్నింగ్ - స్విమ్మింగ్‌ కూడా బాగా వచ్చట. ఏకాగ్రత - గట్టి పట్టుదల ఉంటే తప్ప సాధ్యం కాని అయికిడో వంటి కళల్లో రాహుల్ బ్లాక్ బెల్ట్ సాధించడం ఆయన కఠోర శ్రమ - నిబద్ధతకు నిదర్శనమని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.