Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది

By:  Tupaki Desk   |   22 Sep 2020 7:10 AM GMT
తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్ పేరు మారిపోయింది
X
తెలంగాణ రాష్ట్రంలో ఒక రైల్వే స్టేషన్ పేరును మారుస్తూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా స్టేషన్ లో ట్రైన్ కు స్టాప్ పెట్టించటం అంత తేలికైన విషయం కాదు. దానికో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అలాంటిది ఒక రైల్వే స్టేషన్ పేరును మార్చటం అంటే దానికి చాలానే ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ - కాజీపేట్ సెక్షన్ మధ్యలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ పేరును తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

ఏపీలో తిరుమల ఎలానో.. తెలంగాణలో యాదగిరి గుట్ట (ఇప్పుడు యాదాద్రి) పుణ్యక్షేత్రాన్ని అంతలా మార్చాలని తపించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లే.. తాజాగా రైల్వే స్టేషన్ పేరును మార్చేశారు. యాదాద్రికి దగ్గరగా ఉండే రాయగిరి రైల్వే స్టేషన్ ను ఇకపై యాదాద్రిగా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని రైల్వే బోర్డు తీసుకుంది.

ఒకప్పటి యాదిగిరి గుట్ట పేరును యాదాద్రిగా మారుస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. చిన జీయర్ స్వామి పెట్టిన ఈ పేరును కేసీఆర్ ఎంతగానో ఇష్టపడతారని చెబుతారు. యాదాద్రికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే రాయగిరి రైల్వే స్టేషన్ పేరు మార్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. అంతే కాదు.. రోజు మొత్తంలో కేవలం మూడు.. నాలుగు రైళ్లు మాత్రమే ఈ స్టేషన్ లో ఆగుతాయి.

తాజాగా ఆ స్టేషన్ ను యాదాద్రిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరిన్ని సౌకర్యాలు రానున్న రోజుల్లో వస్తాయని చెబుతున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసును సికింద్రాబాద్ నుంచి యాదాద్రి వరకు పొడిగించే అవకాశం కూడా ఉందంటున్నారు. మరికొన్ని రైళ్లను ఆపటం ద్వారా.. యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్లే వారికి మరింత అనువుగా ఉండేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. యాదాద్రి దేవాలయాన్ని పూర్తిస్థాయిలో పూర్తి చేసేలోపే.. ఇవన్నీ జరిగే అవకాశం ఉందంటున్నారు.