Begin typing your search above and press return to search.

'నీట్' ర్యాంకర్ స్టోరీ… 11 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు తండ్రి!

By:  Tupaki Desk   |   24 Jun 2023 3:14 PM GMT
నీట్ ర్యాంకర్ స్టోరీ… 11 ఏళ్లకు పెళ్లి.. 20 ఏళ్లకు తండ్రి!
X
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు... అని వేటూరి గారు రాసిన ఒక పాటను గుర్తుచేసుకోవాలని అన్నా అది అతిశయోక్తి కాదు. అలాంటి సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 11 ఏళ్లకే పెళ్లి చేసుకుని, 20ఏళ్లకు తండ్రి అయ్యి, ఇప్పుడు నీట్ ర్యాంకర్ గా మారిన యువకుడి కథ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అవును... ఈ మధ్య విడుదలైన ఆల్ ఇండియా మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్ - 2023) లో అనేక మంది స్టూడెంట్స్ మంచి మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో 700 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు చాలామందే ఉన్నారు. కానీ వీరందరిలోనూ 632 మార్కులు సాధించిన రాజస్థాన్‌ కు చెందిన రాంలాల్ భోయ్ మాత్రం అందరికంటే స్పెషల్ అనే చెప్పుకోవాలి.

రాజస్థాన్‌ లోని చిత్తోర్‌ గఢ్ జిల్లాకు చెందిన రాంలాల్ భోయ్ కు డాక్టర్ కావాలని కోరిక. అయితే అతనికి 11ఏళ్ల వయసులో 6వ తరగతి చదువుతున్నప్పుడే తల్లితండ్రులు పెళ్లి చేసేశారు. అనంతరం అతని భార్యతో కలిసి తల్లిదండ్రులతో ఒకే ఇంటిలో నివసించాడు రాంలాల్. ఈ క్రమంలో తన భార్యకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఒక కుమార్తె కు జన్మనిచ్చింది.

అంతకంటే ముందు... పదవ తరగతి వరకు తన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన రాంలాల్... అనంతరం ఏ గ్రూప్ ఎంచుకోవాలనే విషయంలో తీవ్ర సంధిగ్ధంలో ఉన్నాడు. అయితే సైన్స్ లో అద్భుతమైన మార్కులు ఉన్నాయని గమనించిన అతని ఉపాధ్యాయుల్లో ఒకరు.. బైపీసీ గ్రూపు వైపు ఆలోచించమని సలహాఇచ్చారు.

అలా 81% మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రాంలాల్... ఎలాగైనా డాక్టర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా సొంతంగా ప్రిపేర్ అవుతూ నాలుగు సార్లు నీట్ పరీక్ష రాశాడు. అయితే ఆ నాలుగుసార్లు 720కి 350, 320, 362, 490 ల స్కోర్ మాత్రమే చేయగలిగాడు. దీంతో... మూడుసార్లు వరుసగా క్వాలిఫై కాకపోయే సరికి... ఇక ఇంట్లో నుంచి అభ్యంతరాలు రావడం మొదలయ్యయి.

ఇక చదువుకు ఫుల్ స్టాప్ పెట్టేసి ఏదైనా ఉద్యోగం చూసుకోవాలంటూ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రాంలాల్ కు ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే సీట్ కొట్టాలని ఫిక్సయిన రాంలాల్... మొబైల్ ఫోన్ ను దూరం పెట్టి, గట్టిగా ప్రిపేర్ అయ్యాడు. ఫలితంగా ఐదో ప్రయత్నంలో నీట్ యూజీ పరీక్షలో 632 మార్కులు సాధించాడు. ఫలితంగా తనకు ఇష్టమైన వైద్య విద్యను అభ్యసించడానికి రెడీ అవుతున్నాడు.