Begin typing your search above and press return to search.

రేవంత్ గుట్టంతా ఆ హార్డ్ డిస్క్ లోనేనా.?

By:  Tupaki Desk   |   2 Oct 2018 8:08 AM GMT
రేవంత్ గుట్టంతా ఆ హార్డ్ డిస్క్ లోనేనా.?
X
రేవంత్ రెడ్డి కేసులో పోలీసులు పక్కా ఆధారాలు సంపాదిస్తున్నారా.? రేవంత్ ను ఉచ్చులో ఇరికించడానికి పక్కా స్కెచ్ గీశారా.? తాజాగా రేవంత్ సన్నిహితుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ రేవంత్ కేసులో కీలకంగా మారనుందా.? ఈ అనుమానాలన్నింటికి బలం చేకూరేలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సహా ఆయన ప్రధాన అనుచరుడు, ఓటుకు నోటు కేసులో నిందితుడు అయిన ఉదయ్ సింహ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. అంతేకాకుండా ఉదయ్ సింహ బంధువు రణదీర్ రెడ్డి ఇంటిలోనూ సోదాలు చేయగా ఓ హార్డ్ డిస్క్ బయటపడింది. దీనిపై రణదీర్ రెడ్డిని తీసుకెళ్లిన పోలీసులు రాత్రి 12 గంటల వరకూ విచారించారు. అనంతరం ఆయన నివాసం వద్ద వదిలిపెట్టారట..

పోలీసుల విచారణ అనంతరం రణదీర్ రెడ్డి పలు సంచలన విషయాలను మీడియాకు వెల్లడించారు. ఉదయ సింహా ఇళ్లు ఖాళీ చేసే సమయంలో తనకు ఓ కవర్ ఇచ్చాడని.. అందులో ఒక హార్డ్ డిస్క్ - అతడి తల్లి బ్యాంక్ కీ ఉందని చెప్పాడని వివరించారు. ఆ హార్డ్ డిస్క్ లో ఏముందో తనకు తెలియదన్నారు. పోలీసులు నోటీసులు ఇచ్చారని.. స్టేషన్ కు వెళ్లి తీసుకుంటానని వివరించాడు.

ఇలా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆ హార్డ్ డిస్క్ లో ఏముందనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూడు నెలల ముందే ఈ హార్డ్ డిస్క్ ను రణధీర్ రెడ్డికి ఎందుకిచ్చాడు. అందులో రేవంత్ కు సంబంధించిన విషయాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ హార్డ్ డిస్క్ రేవంత్ కొంప ముంచేలా ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. మరి ఇందులో ఏముందనేది పోలీసులు చెబితే గానీ బయటకు రాని పరిస్థితి నెలకొంది.