Begin typing your search above and press return to search.

‘ఈనాడు’ కార్టూనిస్టు శ్రీధర్ రాజీనామా వెనుక అసలేమైంది?

By:  Tupaki Desk   |   31 Aug 2021 10:30 AM GMT
‘ఈనాడు’ కార్టూనిస్టు శ్రీధర్ రాజీనామా వెనుక అసలేమైంది?
X
‘ఈనాడు’ దినపత్రిక ఎంత పాపులర్ అన్నది అందరికి తెలిసిందే. ఈ మీడియా సంస్థకు సంబంధించి పాపులర్ అయిన పేర్లు నాలుగు చెప్పమంటే.. ఏళ్లకు ఏళ్లు ఆ పేపర్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారు చెప్పలేరు. ఒకవేళ చెప్పమంటే.. రామోజీరావు పేరు.. కార్టూనిస్టు శ్రీధర్ పేరు మాత్రం చెప్పగలరు. ఈనాడులో కార్టూనిస్టు శ్రీధర్ కు ఉన్న ప్రత్యేకతకు ఇదో సింఫుల్ ఎగ్జాంఫుల్ మాత్రమే. ఆయన్ను వ్యక్తిగతంలో ఎవరూ వంక పెట్టరు. ఇక.. ప్రొఫెషనల్ గా ఆయన కార్టూన్లలో పాత్రికేయుడికి ఉండాల్సిన ‘స్వేచ్ఛ’ ఉండదన్న విమర్శ ఆయన్ను వెంటాడుతుంటుంది. అయితే.. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా వాదనలు వినిపిస్తారు. దీనిపై ఏకాభిప్రాయం కష్టం.

కార్టూనిస్టు శ్రీధర్ విషయానికి వస్తే.. ఆయన గీతల్లో ఉండే మెరుపు.. అక్షరానికి ఉన్న చురుకును నలభైఏళ్లుగా ఫాలో అవుతున్న వారికి.. ఇకపై ఆ మీడియా సంస్థలో శ్రీధర్ కార్టూన్లు కనిపించని పరిస్థితి. ఎందుకంటే.. ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలోని తన అకౌంట్ ద్వారా తెలియజేశారు. నిజానికి ఆయన రిటైర్ అయి కొద్దికాలమైనా.. ఆయన సర్వీసును పొడిగిస్తూ సంస్థ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కొనసాగుతున్నారు. తాజాగా ఆయన తన పోస్టులో నాలుగు దశాబ్దాలుగా కార్టూనిస్టుగా ఉన్న నేను ఈనాడుకు రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ఎందుకిలా? అసలేమైంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు జర్నలిస్టు వర్గాల్లోనే కాదు ఈనాడుతో అనుబంధం ఉన్న వారంతా ఇప్పుడు ఆరా మొదలైంది. తెలుగు ప్రజల్లో శ్రీధర్ కు ఉన్న ఇమేజ్ అలాంటిది. కేవలం శ్రీధర్ కార్టూన్ కోసమే ఈనాడును కొనేవారు సైతంవేలాది మంది ఉంటారని చెబుతారు. ఈ మాట ఈనాడు కాంపౌండ్ లోనే వినిపిస్తూ ఉంటుంది. ఈనాడులో శ్రీధర్ ప్రస్థానం గురించి కొద్దిమంది సీనియర్లు ఆసక్తికర విషయాలు చెబుతారు. ఆయన ఒకదశలో రాజీనామా చేయాలని భావించినప్పుడు రామోజీ రావు ప్రత్యేకంగా ఆయనతో మాట్లాడి ఒప్పించారని చెబుతారు.

సాధారణంగా ఈనాడులో రిజైన్ అన్న తర్వాత.. దాని మీద చర్చ ఉండదని చెబుతారు. చాలా.. చాలా తక్కువ మంది విషయంలోనే మేనేజ్ మెంట్ కల్పిస్తుందని.. అందులోని ఛైర్మన్ రామోజీరావు స్వయంగా కల్పించుకొనే సందర్భం వేళ్ల మీద లెక్క పెట్టేసార్లు మాత్రమే ఉందని చెబుతారు. శ్రీధర్ రాజీనామా విషయం పాతదే అయినా.. ఆయన ఎందుకు రిజైన్ చేశారన్న దానిపై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉన్నా.. దానికి ఫలానా కారణం అని ఎవరూ చెప్పలేకపోతున్నారు. శ్రీధర్ కు సన్నిహితంగా ఉన్న వారు సైతం రాజీనామా వెనుక విషయం ఏమిటన్నది చెప్పలేకపోతున్నారు.

అయితే.. శ్రీధర్ రాజీనామా వెనుక ఉన్న కారణాలు ఏమిటన్న దానిపై మీడియా వర్గాల్లో వినిపిస్తున్న ఐదు కారణాల్ని చూస్తే.. ఆరోగ్య కారణమని చెబుతున్నా.. అందులో నిజం లేదంటున్నారు. రోజుల వ్యవధిలోనే కొడుకు పెళ్లి చేసి.. ఆ సందర్భంగా ఉత్సాహంగా కనిపించిన ఆయనలో ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. ఈ మధ్యన కరోనా కారణంగా తన కుటుంబ సభ్యులకు చెందిన వారు మరణించటం.. ఆయన్ను బాధించిందని.. మానసిక ప్రశాంతతకు రిజైన్ చేసినట్లు చెప్పారు. రామోజీకి దగ్గరగా ఉన్న వారిని పొగబెట్టి పంపుతున్నట్లుగా చర్చ జరుగుతున్నా అదెంత వరకు నిజమన్నది ఒక ప్రశ్న. సోషల్ మీడియాలో ఈ మధ్యన శ్రీధర్ వర్సెస్ మోహన్ అనే దివంగత ఆర్టిస్టు విధేయుల మధ్య ఒక రచ్చ నడుస్తోంది. ఇది అంతకంతకూ పెరిగి పెద్దదై.. స్థాయి దాటటమే కాదు.. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లినట్లు చెబుతారు. ఆ విషయంలోకి మరింత లోతుకు వెళ్లకపోవటమే మంచిది. ఈ మధ్యన తన నలబై ఏళ్ల కార్టూనిస్టు ప్రస్థానం మీద శ్రీధర్ ఇమేజ్ బిల్డింగ్ ప్రోగ్రాం మొదలు పెట్టారని.. అది ఈనాడు ముఖ్యులకు నచ్చలేదంటారు. ఈ విషయంలో జరిగిన చర్చకు నొచ్చుకున్న శ్రీధర్.. గుడ్ బై చెప్పారంటారు. ఏమైనా.. కార్టూనిస్టు శ్రీధర్ రిజైన్ వ్యవహారంపై చర్చ మరింత కాలం సాగుతుందన్న మాట బలంగా వినిపిస్తోంది.