Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వడం వెనుక రీజన్

By:  Tupaki Desk   |   1 Jun 2019 5:53 AM GMT
కిషన్ రెడ్డి హోం శాఖ సహాయ మంత్రి పదవి ఇవ్వడం వెనుక రీజన్
X
మోదీ తొలి ప్రభుత్వంలో రాజనాథ్ సింగ్ హోం మంత్రిగా వ్యవహరించగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కిరణ్ రిజిజుకు అనూహ్యంగా హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. బీజేపీకి పెద్దగా పట్టులేని ప్రాంత నేతకు అంతకీలక శాఖ ఇవ్వడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. కానీ.. ఈ అయిదేళ్లలో ఈశాన్యాన బీజేపీ తన జెండా రెపరెపలాడిస్తోంది. అంతేకాదు.. వివాదాస్పద నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ వంటి కార్యక్రమాలు అస్సాంలో ఎంత వ్యతిరేకతను తెచ్చాయో బీజేపీని అస్సాం సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో అంతగా బలపడేలా చేశాయి. వీటన్నిటి వెనుక హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు పాత్ర ఎంతో ఉంది.

ఇప్పుడు కిషన్ రెడ్డికి అదే శాఖ ఇవ్వడంతో తెలంగాణలో బీజేపీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతుందనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తమ భావజాల వ్యాప్తికి, అందుకు అడ్డంగా ఉన్న పరిస్థితులను సద్దుమణచడానికి ఈ శాఖ కిషన్ రెడ్డికి, తద్వారా బీజేపీకి బాగా ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

కిషన్ రెడ్డి కేవలం తెలంగాణకే పరిమితం కాకుండా దక్షిణాది మొత్తం ప్రభావం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. శాఖ కేటాయించిన తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి అందుకు తగ్గ సంకేతాలు పంపించారు కూడా. ఉగ్రవాదులకు హైదరాబాద్ సురక్షిత స్థావరంగా మారిందని... నగరంలో వారిని పూర్తిగా కట్టడి చేస్తామని ఆయన అన్నారు. హోంమంత్రి అమిత్ షాతో కలసి పనిచేసే భాగ్యం తనకు లభించినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ఏపీకి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లేనందువల్ల... ఆ రాష్ట్రాన్ని కూడా చూసుకునే బాధ్యతను తనకు అప్పగించారని... ఈ మేరకు హైకమాండ్ తనకు స్పష్టమైన మార్గనిర్దేశం చేసిందని తెలిపారు.

సో... దక్షిణాది, అందులోనూ ప్రత్యేకంగా తెలంగాణను అన్ని రకాలుగా బీజేపీ పరం చేసే లక్ష్యంతో కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు అర్థమవుతోంది. ఇదంతా బీజేపీ అనుకున్నది అనుకున్నట్లుగా వాస్తవ రూపం దాల్చితే తెలంగాణ, ఏపీల్లో అనూహ్య నిర్ణాయాలు, పరిణామాలు ముందుముందు కనిపించనున్నాయి.