Begin typing your search above and press return to search.

కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస' ప్రారంభం!

By:  Tupaki Desk   |   22 Aug 2020 11:50 AM GMT
కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస ప్రారంభం!
X
పరారీలో ఉన్న వివాదాస్పద మత గురువు నిత్యానంద మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తాను ఏర్పాటు చేసుకున్న హిందూ దేశంలో సొంత రిజర్వ్ బ్యాంకును ప్రారంభించారు. వినాయకచవితి సందర్భంగా తన దేశంగా చెప్పుకుంటున్న కైలాస ద్వీపం లో ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస’ను ప్రారంభించారు. అంతేకాకుండా కైలాస దేశానికి సంబంధించిన నాణేలను కూడా విడుదల చేశారు. ఆర్బీకే నాణేలు బంగారంతో చేసినవి అని నిత్యానంద ప్రకటించారు.

అలాగే ఇదే సందర్భంలో ప్రపంచంలోని ఏ దేశ కరెన్సీ అయినా కూడా ఈ కైలాస దేశంలో చెల్లుబాటు అవుతుందని, అలాగే కైలాస దేశం కరెన్సీ కూడా అన్ని దేశాల్లో చెల్లుబాటు అవుతుందని నిత్యానంద వెల్లడించారు. దీనికి సంబంధించి పలు దేశాల బ్యాంకులతో చట్టబద్దంగా ఎంఓయూ కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు. సంపూర్ణ హిందూ ధర్మాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని పేర్కొన్న నిత్యానంద.. దానికోసం చివరి వరకు పోరాడతానని చెప్పుకొచ్చాడు. అలాగే తనకి ప్రస్తుతం భారత్ ‌లో అనుమతి లేదని.. అయినప్పటికీ తాను జీవ సమాధి అయ్యేది బెంగుళూరులోని బిడది ఆశ్రమంలోనే అని నిత్యానంద వెల్లడించారు.

కాగా , పిల్లల అక్రమ నిర్బంధం, మహిళల అదృశ్యం, అపహరణ కేసుల్లో గతేడాది తప్పించుకుని, దేశం విడిచి పారిపోయిన నిత్యానంద ఈక్వెడార్‌లోని భాగమైన ఓ ద్వీపాన్ని కొని, అక్కడ హిందూదేశం నిర్మించుకొన్నట్టు తొలుత వార్తలొచ్చాయి. అధికార మతంగా సనాతన హైందవాన్ని ప్రకటించుకొన్న ఈ దేశంలో పాస్‌పోర్టు నుంచి పౌరసత్వం దాకా ప్రతీది ప్రత్యేకమేనని కథనాలు వెలువడ్డాయి.