Begin typing your search above and press return to search.

రేవంత్ బ్యాటింగ్‌.. టీఆర్ఎస్‌, బీజేపీ షాకింగ్‌

By:  Tupaki Desk   |   14 July 2021 10:30 AM GMT
రేవంత్ బ్యాటింగ్‌.. టీఆర్ఎస్‌, బీజేపీ షాకింగ్‌
X
అటు అధిష్టానం.. ఇటు కేడ‌ర్ త‌న‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటున్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్ర‌మాణ స్వీకారం చేసి వారం రోజులు గ‌డ‌వ‌కుండానే.. త‌న మార్కు చూపిస్తున్నారు. సొంత పార్టీలో త‌న‌ను వ్య‌తిరేకించిన వారినే.. అనుకూలంగా మార్చుకున్నారు. ఆ త‌ర్వాత పార్టీ బ‌లోపేతంపై దృష్టి సారించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ పార్టీని వీడి వెళ్లిపోయిన వారిని, ఇత‌ర పార్టీల్లోని వారిని తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చుందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. వెంట‌నే రెండు సిక్స‌ర్లు కొట్ట‌డంతో.. ప్ర‌త్య‌ర్థులు అల‌ర్ట్ అయిపోయారు.

దేశవ్యాప్తంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలకు వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేర‌కు తెలంగాణ కాంగ్రెస్ చేప‌ట్టిన ఆందోళ‌న కూడా స‌క్సెస్ అయ్యింది. దీంతో.. పార్టీ శ్రేణుల్లో ఎక్క‌డ లేని ఉత్సాహం వ‌చ్చేసింది. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలోనే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయ‌డంతో.. రేవంత్ కు షాక్ త‌గిలిన‌ట్టేన‌ని భావించారు అంద‌రూ. ఇప్ప‌టికే కోమ‌టిరెడ్డి ఏదో విధంగా త‌న నిర‌స‌న స్వ‌రం వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కౌశిక్ రెడ్డి పార్టీని వీడ‌డం.. 50 ల‌క్ష‌లు డ‌బ్బులు ఇచ్చి పీసీసీ ప‌ద‌వి కొనుక్కుడాని ఆరోప‌ణ‌లు చేయ‌డంతో కాంగ్రెస్ జోష్ మొత్తం నీరు గారుతుంద‌ని భావించారు. కానీ.. త‌న‌దైన వ్యూహంతో ఆ విష‌యానికి చెక్ పెట్టారు రేవంత్‌.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన‌ మాజీ ఎంపీ, సీనియ‌ర్ నేత కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని తిరిగి పార్టీలోకి తీసుకొచ్చారు. ఈ మేర‌కు రేవంత్ మాట్లాడ‌డం.. విశ్వేశ్వ‌ర్ రెడ్డి సానుకూలంగా స్పందించ‌డం అన్నీ జ‌రిగిపోయాయి. రేవంత్ కు పీసీసీ చీఫ్ రావ‌డం ఆనందంగా ఉంద‌న్న విశ్వేశ్వ‌ర్ రెడ్డి.. కాంగ్రెస్ లో త్వ‌ర‌లోనే చేరుతాన‌ని చెప్పారు. రేవంత్ కు వ్య‌క్తిగ‌తంగా చూసుకున్నా.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప‌రంగా చూసుకున్నా ఇది పెద్ద విష‌య‌మే.

తాజాగా.. రెండో సిక్స‌ర్ సంధించారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు మ‌రాఠా చంద్ర‌శేఖ‌ర్ అలియాస్ ఎర్ర శేఖ‌ర్ ను కాంగ్రెస్ గూటికి తీసుకొచ్చి అల‌జ‌డి సృష్టించారు. 1995 నుంచి క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్న శేఖ‌ర్‌.. ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో బీజేపీలో చేరారు. అయితే.. తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్ప‌టి నుంచీ రేవంత్ రెడ్డి - శేఖ‌ర్ మ‌ధ్య‌స‌త్సంబంధాలే ఉన్నాయి. దీంతో.. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడు కావ‌డంతో.. ఎర్ర శేఖ‌ర్ కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మయ్యారు. మంగ‌ళ‌వారం రేవంత్ రెడ్డిని క‌లిసిన ఆయ‌న‌.. బీజేపీకి రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. నాలుగైదు రోజుల్లో కాంగ్రెస్ లో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు. శేఖ‌ర్ చేరిక‌తో ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జీవం రావ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. జిల్లాలోని మ‌రికొంద‌రు ఇత‌ర పార్టీల నాయ‌కులు, యువ‌కులు కూడా రేవంత్ నాయ‌క‌త్వాన్ని జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

మొత్తానికి రేవంత్ రేవంత్ పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన వెంట‌నే ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో దుమ్ము లేపుతున్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. రాహుల్ గాంధీ నుంచి ఫుల్ స‌పోర్టు ఉండ‌డంతో.. పార్టీ ప్ర‌క్షాళ‌న‌, పున‌ర్నిర్మాణం ఏక‌కాలంలో క‌లిపి చేప‌డుతున్నారు రేవంత్‌. పాడి కౌశిక్ రెడ్డి విష‌యంలో కాంగ్రెస్ సీనియ‌ర్లు స్పందించిన విష‌య‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. కౌశిక్ రెడ్డి తీరుపై సీనియ‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇన్నాళ్లూ పార్టీలో ఉండి, టీఆర్ ఎస్ తో గూడుపుఠానీ న‌డిపిందే కాకుండా.. పార్టీపై ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని ఖండించారు. అంతేకాకుండా.. గ‌తానికి భిన్నంగా 24 గంట‌ల్లో షోకాజ్ నోటీసు జారీచేశారు. అటు కాంగ్రెస్ రాష్ట్ర ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్ సైతం కౌశిక్ రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై తీవ్రంగా స్పందించారు. రూ.50 ల‌క్ష‌లు తీసుకొని రేవంత్ కు అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌నే ఆరోప‌ణ‌ల‌పై లీగ‌ల్ నోటీసులు సైతం ఇస్తాన‌ని మండిప‌డ్డారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏక‌ధాటిపై న‌డుస్తోంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదే ప‌ద్ధ‌తిన ముందుకు సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బ‌ల‌మైన శ‌క్తిగా ఎదిగే అవకాశం ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.