Begin typing your search above and press return to search.

రజినీకాంత్‌ వ్యాఖ్యలకు రోజా కౌంటర్‌!

By:  Tupaki Desk   |   29 April 2023 1:04 PM
రజినీకాంత్‌ వ్యాఖ్యలకు రోజా కౌంటర్‌!
X
తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తాజాగా ఆంధ్రప్రదేశ్‌ లో పర్యటించిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకిలో జరిగిన ఎన్టీఆర్‌ శతజయంతి సభకు రజినీకాంత్‌ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణలపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు కృషేనని తెలిపారు. అలాగే కంటి చూపుతో చంపేస్తా వంటి డైలాగులు తానో, అమితాబ్‌ బచ్చనో, అమీర్‌ ఖానో, సల్మాన్‌ ఖాన్‌ చెప్తే సూట్‌ కావని.. అవి బాలయ్య చెప్తేనే అభిమానులు ఆనందిస్తారని ప్రశంసించారు.

ఈ నేపథ్యంలో రజినీకాంత్‌ వ్యాఖ్యలపై యథావిధిగా వైసీపీ నేతలు కౌంటర్‌ ఎటాక్‌ కు దిగారు. ఏపీ రాజకీయాల గురించి రజినీకి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో పార్టీ పెడుతున్నా.. పెడుతున్నా అని అభిమానులను మోసగించిన వ్యక్తి రజినీ అని మండిపడుతున్నారు.

తాజాగా రజినీ వ్యాఖ్యలకు ఏపీ పర్యాటక శాఖ మంత్రి, రజినీకాంత్‌ తో పలు సినిమాల్లో నటించిన రోజా కౌంటర్‌ ఇచ్చారు. రజినీకి తెలుగు రాష్ట్రంపైన, రాజకీయాలపైన ఎలాంటి అవగాహన లేదన్నారు. ఆయన వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందన్నారు.

రజినీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో.. రజినీకాంత్‌ కు వీడియోలు ఇస్తానన్నారు. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేయించి అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. రజినీకాంత్‌ కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదని రోజా ఘాటు విమర్శలు చేశారు.

రజినీకాంత్‌ వ్యాఖ్యలతో ఎన్టీఆర్‌ ఆత్మ కూడా బాధపడుతుందని రోజా అభిప్రాయపడ్డారు. నిజమైన ఎన్టీఆర్‌ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్‌ వ్యాఖ్యలు ఉన్నాయని తప్పుబట్టారు. చంద్రబాబు లేనప్పుడే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందన్నారు. విదేశాల్లో తెలుగువారు ఉద్యోగాలు పొందడానికి కారణం వైఎస్సార్‌ అని రోజా చెప్పడం గమనార్హం. ఇందుకు కారణం చంద్రబాబు కాదనేది రజినీకాంత్‌ తెలుసుకోవాలన్నారు.

ఫీజు రియింబర్స్‌మెంట్‌ తెచ్చింది వైఎస్సార్‌ అని చంద్రబాబు కాదని రోజా తెలిపారు. చంద్రబాబు విజన్‌ 2020 వల్ల టీడీపీ 23 సీట్లకు పరిమితమైందని ఎద్దేవా చేశారు. విజన్‌ 2047కి చంద్రబాబు ఏ దశలో ఉంటారో రజనీకాంత్‌ కి తెలుసా? అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి.. రజనీకాంత్‌ పై తెలుగు ప్రజలకు ఉన్న గౌరవాన్ని ఆయన తగ్గించుకున్నారని రోజా అభిప్రాయపడ్డారు.

ఇంతలా ఎన్టీఆర్‌ గురించి మాట్లాడేవారు 27 ఏళ్లలో ఎన్టీఆర్‌ కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదని రోజా ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ యుగపురుషుడు అన్న వారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? అని నిలదీశారు. రజినీకాంత్‌ చెప్పినట్టు 2024లో చంద్రబాబు సీఎం అయ్యే అవకాశమే లేదన్నారు. రజినీకి ఎన్టీఆర్‌ ను అసెంబ్లీలో ఎలా అవమానించారో రికార్డులు పంపిస్తానని కామెంట్స్‌ చేశారు.