Begin typing your search above and press return to search.

రెండు సీట్లలో మాజీ ఎమ్మెల్యే లొల్లి...ఇదేమి ఖర్మ అంటున్న తమ్ముళ్ళు

By:  Tupaki Desk   |   4 May 2023 2:46 PM GMT
రెండు సీట్లలో మాజీ ఎమ్మెల్యే లొల్లి...ఇదేమి ఖర్మ అంటున్న తమ్ముళ్ళు
X
తెలుగుదేశం పార్టీ ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. తనకు గతంలో కంచుకోటలైన జిల్లాలలో పూర్వ వైభవం సాధించాలని చూస్తోంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలోనే ఇపుడు సొంత పార్టీలో లొల్లి స్టార్ట్ అయింది. రెండు సీట్లలో తమ్ముళ్ళు ఇపుడు సీట్ల కోసం ఫైటింగ్ చేస్తూ సైకిల్ జోరుకు బ్రేకులు వేస్తున్నారు.

ఇందులో మొదటిగా తీసుకుంటే పిఠాపురం నుంచి ఎమ్మెల్యే 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎస్వీ ఎస్ ఎన్ వర్మ 2024 ఎన్నికల్లో తానే మళ్లీ అంటున్నారు. ఆయనకు పార్టీ రెండు సార్లు టికెట్ ఇచ్చింది. 2019లో అయితే వైసీపీ చేతిలో ఓడిపోయారు. ఇపుడు మళ్లీ పోటీకి తయారు అని అనడమేంటని తమ్ముళ్లు మండిపడుతున్నారు.

ఇదిలా ఉండగా పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేనకు పోతుందని ఒక అంచనా ఉంది. దాంతో వర్మ తెలివిగా పక్కన ఉన్న ప్రత్తిపాడు మీద కూడా దృష్టి సారించారు. అక్కడ పరుపుల రాజా అని కీలక నాయకుడు ఉండేవారు. ఆయన ఇటీవలే సడెన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయారు. దాంతో ఆ సీటుని ఆయన సతీమణి సత్యప్రభకు ఇంచార్జిగా కేటాయించింది పార్టీ అధినాయకత్వం

అయితే ఎన్నికల వేళకు సమీకరణలు మారితే ఆ సీట్లో తాను పోటీ చేయవచ్చు అన్నదే వర్మ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. ఇక వర్మకు 2014లోనే టికెట్ ఇవ్వడం మీద పిఠాపురంలోని బలమైన కాపు సామాజిక వర్గం నుంచి అభ్యంతరాలు వచ్చాయి. పిఠాపురం అంటేనే కాపులు అత్యధిక శాతం ఉన్న సీటు. 1983 నుంచి తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు కానీ కాపులకే టికెట్లు ఇస్తూ వస్తున్నాయి. అలా కాపులే గెలుస్తునారు.

ఆ సీట్లో వర్గం 2014 నుంచి పాగా వేశారని, రెండు సార్లు టికెట్ తెచ్చుకున్నారని ఆ విధంగా కాపులకు పిఠాపురంలో అన్యాయం జరుగుతోందని ఆ సామాజికవర్గం వాదనగా ఉంది. జనసేనతో పొత్తు లేకపోయినా వర్మకు అయితే టికెట్ ఇవ్వవద్దని స్థానిక టీడీపీ తమ్ముళ్ళు పట్టుబడుతున్నారు. ఒకవేళ సీటు వర్మకు ఇచ్చారంటే ఓడించి తీరుతామని కూదా స్పష్టం చేస్తున్నారు.

వర్మ ఎమ్మెల్యేగా ఉన్నపుడు తమను పట్టించుకోలేదని తమ బంధువులు సన్నిహితులనే ఆయన చేరదీశారని అంటున్నారు. ఇదిలా ఉంటే వర్మ ఎందుకైనా మంచిదని ప్రత్తిపాడు రాజకీయాల్లో వేలు పెడుతున్నారుట. బీసీలు ఎక్కువగా ఉండే ప్రత్తిపాడులో తనకు టికెట్ కోసం వర్మ మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తో కలసి ప్రయత్నాలు చేసుకుంటున్నారని అంటున్నారు.

బీసీలు ఉన్న సీట్లోకి వర్మకు ఎలా రానిస్తామని ప్రత్తిపాడు తమ్ముళ్ళు మండిపడుతున్నారు. మరో వైపు తూర్పు గోదావరి జిల్లాకు టీడీపీ ప్రెసిడెంట్ జ్యోతుల నవీన్ తో వర్మ వర్గ పోరుని కొనసాగిస్తున్నారుట. అదే టైం లో జ్యోతుల నెహ్రూ అంటే దూరం పాటించే యనమలను తన వైపునకు తిప్పుకోవడం ద్వారా పసుపు పార్టీలో పసందైన రాజకీయాలను చేస్తున్నారు అని అంటున్నారు

ఈ నేపధ్యంలో ఈ రెండు సీట్లలో తమ్ముళ్ళు ఇదేమి ఖర్మ వర్మ తో అని ఫైర్ అవుతున్నారుట. ప్రత్తిపాడు పిఠాపురం సీట్ల విషయంలో హై కమాండ్ సరైన నిర్ణయం తీసుకోవాలని గట్టిగా కోరుతున్నారుట. అసలే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతీ సీటు చాలా ముఖ్యమని భావిస్తున్న నేపధ్యంలో ఈ పోరేంటి అని అధినాయాకత్వం కన్నెర్ర చేస్తోంది. మొత్తానికి ఒక వర్మ రెండు సీట్లు అన్నట్లుగా గోదావరి జిల్లా రాజకీయాలలో కలి పుట్టించేస్తున్నారు. దీని మీద హై కమాండ్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో చూడాల్సి ఉంది అంటున్నారు.