Begin typing your search above and press return to search.

ప్రైవేటీకరణ దిశగా మహారాజా కళాశాల..సంచయిత మరో వివాదాస్పద నిర్ణయం!

By:  Tupaki Desk   |   30 Sep 2020 6:45 AM GMT
ప్రైవేటీకరణ దిశగా మహారాజా కళాశాల..సంచయిత మరో వివాదాస్పద నిర్ణయం!
X
2020 మార్చి 4న మాన్సాస్‌ ట్రస్ట్ ఛైర్మన్‌ గా సంచైత గజపతిరాజు బాధ్యతలు తీసుకున్నారు. ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమా గజపతి. వీరికి ఇద్దరు సంతానం. వారిలో చిన్న కుమార్తె సంచైత గజపతిరాజు. రాత్రికి రాత్రే ఆమె మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ గా బాధ్యతలు చేపట్టటమే కాకుండా.. హఠాత్తుగా తెరపైకి వచ్చి పూసపాటి వంశీయుల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. అయితే సంచైత పై ఆమె బాబాయ్ అశోక్‌ గజపతిరాజు కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్న తరుణంలోనే తాజాగా ఆమె మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ మాన్సాస్‌ కు సంబందించిన చిన్నా చితకా నిర్ణయాల్లోనే సంచైత వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శలు వినిపిస్తుండగా ఇఫ్పుడు ఏకంగా పూసపాటి వంశీయులకు చెందిన దశాబ్దాల నాటి మహారాజా కళాశాలను ప్రైవేట్ పరం చేయాలనీ నిర్ణయం తీసుకోవడంతో ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.

దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. పూసపాటి రాజవంశీయులు 1879లో విజయనగరంలో మహారాజా ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఆ తర్వాత కొద్దిరోజులకి డిమాండ్‌ పెరగడంతో ఇంటర్‌, డిగ్రీ కోర్సులను కూడా ప్రారంభించారు. దశాబ్దాలుగా ఎందరికో ఉన్నత విద్యాభ్యాసం అందించిన ఈ కళాశాలలో చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్ధానాలకు చేరుకున్నారు. విదేశాలకు వెళ్లారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ ఉన్నత విద్యాసంస్ధను తర్వాత కేవలం కళాశాలకే పరిమితం చేశారు. స్కూలును మరో ప్రాంగణంలోకి తరలించి ప్రైవేటు పరం చేసేశారు. అప్పటి, నుంచి ఇది కాలేజీగానే కొనసాగుతూ వచ్చింది. ప్రస్తుతం ఇందులో 26 మంది అన్‌ ఎయిడెడ్‌, 100 అన్‌ ఎయిడెడ్‌ అధ్యాపకులు ఉన్నారు. 35 మంది బోధనేతర సిబ్బంది కూడా ఉన్నారు. 4 వేల మంది విద్యార్ధులు ఇక్కడ చదువుతున్నారు. యూజీసీ నిధులతోనే ఈ కాలేజీ ఇప్పటికీ నడుస్తోంది.

హైస్కూల్‌ గా మొదలుపెట్టి కాలేజీ అయిన మహారాజా కళాశాలలో హైస్కూల్‌ ఎప్పుడో ప్రైవేటు పరం అయిపోగా.. ఇప్పుడు కాలేజీని కూడా ప్రైవేటుకు అప్పగించాలని మాన్సాస్ తాజాగా నిర్ణయించింది. నిర్వాహణా భారం పెరుగుతుందన్న కారణంతో మాన్సాస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు. ఉన్నత విద్యామండలి వీటిని పరిశీలిస్తోంది. ఓసారి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మహారాజా కాలేజీ కూడా ప్రైవేటు పరం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా కళాశాలలు ప్రారంభం కాలేదు. దీనితో వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభం లోపలే ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె పలు వివాదాస్పదమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారంటూ ఆమె బాబాయ్‌ అశోక్‌తో పాటు విపక్ష పార్టీలు ఆరోపిస్తుండగా.. తాజాగా మహారాజా కాలేజ్‌ విషయంలోనూ ఆమె నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.