Begin typing your search above and press return to search.

ఆమె కోడ్ ను ట్రాక్ చేయటం సాధ్యం కాదేమో?

By:  Tupaki Desk   |   8 Dec 2020 10:34 AM GMT
ఆమె కోడ్ ను ట్రాక్ చేయటం సాధ్యం కాదేమో?
X
తరచూ వార్తల్లో నిలవటం.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కొద్దిమందిలో మాన్సస్ ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత గజపతి రూటు సపరేటు. ఏపీ అధికారపక్షం మద్దతుతో మాన్సస్ పగ్గాలు చేపట్టిన ఆమె ఇప్పటికే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. అలాంటి ఆమె తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారటమే కాదు.. ఏపీ అధికారపక్షానికి మింగుడుపడని రీతిగా మారింది.

దేశంలోని బీజేపీయేతర రాజకీయ పక్షాలన్ని వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకించటం తెలిసిందే. గడిచిన పదకొండు రోజులుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. తాజాగా భారత్ బంద్ కూడా విజయవంతమైంది. దేశ విదేశాల్లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం మీద నిరసనలు.. వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. ఏపీ అధికారపక్షం కూడా భారత్ బంద్ కు మద్దతు ఇస్తూ ప్రకటన చేయటమే కాదు.. ప్రభుత్వమే బంద్ ప్రశాంతంగా జరిగేలా పలు కార్యక్రమాల్ని చేపట్టింది.

ఇలాంటివేళ.. అనూహ్యంగా సంచయత గజపతి మాత్రం మోడీ సర్కారుకు అనుకూలంగా.. వ్యవసాయ చట్టానికి మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు సంచలనంగా మారింది. అక్కడితో ఆగని ఆమె.. ప్రతి మార్పు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటుందని.. కానీ మంచి కోసమే ఆ మార్పు అని.. దాన్ని స్వాగతించాలంటూ ఆమె వ్యాఖ్యలు ఏపీ అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారనుంది. రైతు చట్టాలు చారిత్రాత్మకమైనవని.. వ్యవసాయ రంగానికి సంస్కరణలు చాలా అవసరమని ఆమె పేర్కొన్నారు.

ఇక్కడితో ఆగని ఆమె.. ప్రధాని మోడీకి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్న పిలుపును ఇవ్వటం కొత్త ట్విస్టుగా చెప్పాలి. ఓవైపు తనకు మద్దతుగా నిలిచిన పార్టీ.. ఒక లైన్ తీసుకొన్న వేళ.. అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకోవటం ఒక ఎత్తు అయితే.. దానిపై ఓపెన్ కావటం ద్వారా పార్టీని ఇబ్బందికి గురి చేయటం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి.. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.