Begin typing your search above and press return to search.

తిరుపతి ఎంపీ బరిలో ఆ ఐఏఎస్‌!

By:  Tupaki Desk   |   14 Feb 2023 9:46 AM
తిరుపతి ఎంపీ బరిలో ఆ ఐఏఎస్‌!
X
ఆంధ్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. సామాజిక సమీకరణాలు, ఆర్థిక, అంగ బలాలు ఆధారంగా అభ్యర్థులను జల్లెడపడుతున్నాయి. మరోసారి 2019 ఎన్నికల మాదిరిగానే ఘన విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్‌ అభ్యర్థుల ఎంపికపైన గట్టిగానే దృష్టి సారించారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ బరిలో ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని దించుతారని టాక్‌ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక అధికారిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ కరికాల వలవన్‌ ను తిరుపతి ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని సమాచారం.

సీఎం వైఎస్‌ జగన్‌ మనసు చూరగొన్న అధికారుల్లో కరికాల వలవన్‌ ఒకరని చెబుతున్నారు. దళిత సామాజికవర్గానికి చెందిన కరికాల వలవన్‌ ఇప్పటివరకు అనేక శాఖలకు కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్రంలో అధికార వర్గాల్లో అత్యున్నత పోస్టు అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) పోస్టుకు ఆయన కూడా పోటీలో ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా తన సొంత సామాజికవర్గానికి చెందిన కేఎస్‌ జవహర్‌రెడ్డిని సీఎం జగన్‌ సీఎస్‌ గా నియమించిన సంగతి తెలిసిందే.

కాగా ప్రస్తుతం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కరికాల వలవన్‌ పదవీ కాలం త్వరలో పూర్తి కానుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరడం లాంచనమేనంటున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎంపీగా వైసీపీకి చెందిన గురుమూర్తి ఉన్నారు.

వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుపతి సీట్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 2014లో వరప్రసాదరావు ఎంపీగా విజయం సాధించారు. 2019లో వరప్రసాదరావు గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో 2019 ఎన్నికల్లో తిరుపతి ఎంపీగా వైసీపీ తరఫున బల్లి దుర్గాప్రసాదరావు విజయం సాధించారు.

అయితే అనారోగ్య కారణాలతో బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూయడంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దిళ్ల గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఉప ఎన్నికలోనూ వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు.

కాగా తిరుపతి ఎంపీ స్థానం అత్యధికంగా చింతా మోహన్‌ ఆరుసార్లు విజయం సాధించారు. తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నుంచి చింతా మోహన్‌ గెలుపొందారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత పార్టీలు మారినా ఆయన మాత్రం కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని టాక్‌ నడుస్తోంది. సూళ్లూరుపేట లేదా గూడూరు నుంచి గురుమూర్తిని పోటీ చేయించవచ్చని చెబుతున్నారు. తిరుపతి ఎంపీ బరిలో సీనియర్‌ ఐఏఎస్‌ కరికాల వలవన్‌ పోటీ ఖాయమనేని చర్చ జరుగుతోంది. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన పనబాల లక్ష్మినే పోటీ చేసే చాన్సు ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.