Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఆ అధికారం ఉండ‌కూడ‌దా?

By:  Tupaki Desk   |   12 Aug 2022 8:20 AM GMT
సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తికి ఆ అధికారం ఉండ‌కూడ‌దా?
X
దేశంలో అత్యున్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు బెంచ్‌లకు కేసులను అప్పగించే అధికారం ప్రధాన న్యాయమూర్తికి ఉండకూడదని సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే అంటున్నారు. మానవ ప్రమేయం ఏమాత్రం లేకుండా ఈ ప్రక్రియ మొత్తం పూర్తి ఆటోమేటెడ్‌గా, కంప్యూటరైజేషన్‌ ద్వారా కొనసాగాలంటున్నారు. బెంచ్‌లకు సబ్జెక్టుల కేటాయింపు వ‌ర‌కు మాత్ర‌మే ప్రధాన న్యాయమూర్తి చేయొచ్చ‌ని చెబుతున్నారు. ఆ తర్వాత కేసుల కేటాయింపు మాత్రం కంప్యూటర్‌ ద్వారానే జ‌ర‌గాల‌ని అంటున్నారు.

ఈ విషయంలో రిజిస్ట్రీ, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జోక్యం ఇబ్బందికరంగా ఉంటోంద‌ని దుష్యంత్ ద‌వే చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా గతంలో ఒక కార్పొరేట్‌ సంస్థ కేసులను ఒక నిర్దిష్ట బెంచ్‌కు మాత్రమే కేటాయించేవారని ఆయ‌న ఆరోపిస్తున్నారు.

ఉదాహ‌ర‌ణ‌కు జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని బెంచ్‌కు మాత్ర‌మే ఎప్పుడూ ఒక అతిపెద్ద కార్పొరేట్‌కు సంబంధించిన కేసులు కేటాయించేవార‌ని దుష్యంత్ ద‌వే గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా అరుణ్ మిశ్రా బెంచ్ ఇప్ప‌టివ‌ర‌కు ఆ కార్పొరేట్ కంపెనీకి అనుకూలంగా ఏకంగా తొమ్మిది తీర్పులు ఇచ్చింద‌ని చెబుతున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ 2019లోనే తాను లేఖ రాసే సమయానికే నాలుగు తీర్పులు వచ్చేశాయ‌న్నారు. ఆ తర్వాత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి గొగోయ్‌ మరో ఐదు తీర్పులు ఇచ్చార‌న్నారు. ఆ తర్వాత జస్టిస్‌ గొగోయ్‌ తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆ కార్పొరేట్‌ సంస్థ అధినేతను కుటుంబంతో సహా ఆహ్వానించడాన్ని ఎలా అర్థం చేసుకోవాల‌ని దుష్యంత్ ద‌వే ప్ర‌శ్నించారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నా కోర్టులో అంతా క‌ళ్లు మూసుకుని కూర్చోవాల‌ని అనుకోవడం త‌న వ‌ల్ల కాద‌ని అన్నారు. జడ్జిలంతా ఏం చేస్తున్నార‌ని నిల‌దీశారు. అరుణ్ మిశ్రా బెంచ్‌ను సదరు కార్పొరేట్‌ సంస్థ కోసమే ఉద్దేశించారా? అని దుష్య్ంత్ దవే ప్రశ్నించారు.

అంతేకాకుండా దుష్యంత్ ద‌వే ప‌లు సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. సుప్రీంకోర్టుకు వచ్చిన కార్పొరేట్‌ సంస్థల కేసుల్లో వారి సక్సెస్‌ రేటు 90శాతం పైగానే ఉంటుంద‌న్నారు. ఇది దేనికి సంకేత‌మ‌ని ప్ర‌శ్నించారు. అత్యున్నత న్యాయస్థానం ప్రతిష్ఠను, గౌరవాన్ని వారి సహచర జడ్జిలు ఎలా దెబ్బతీస్తున్నారో ఇతర న్యాయమూర్తులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంద‌న్నారు. సుప్రీంకోర్టులో కొంద‌రు జ‌డ్జిలు ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారో కాబట్టే.. ప్ర‌జ‌లు కూడా సుప్రీంకోర్టు వైఫ‌ల్యాల గురించి మాట్లాడుకుంటున్నార‌ని అన్నారు. కేసుల లిస్టింగ్‌ వ్యవస్థ హైకోర్టులో సక్రమంగా పనిచేస్తున్నప్పుడు సుప్రీంకోర్టులో ఎందుకు పనిచేయద‌ని నిల‌దీశారు. ఈ అంశంపై ఇప్ప‌టికైనా న్యాయ‌మూర్తులు ఆత్మపరిశీలన చేసుకోవాల‌న్నారు. లేకపోతే సుప్రీం మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంద‌ని చెప్పారు.

అలాగే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప‌నితీరు కూడా పార‌ద‌ర్శ‌కంగా ఉండ‌టం లేద‌ని దుష్యంత్ ద‌వే అంటున్నారు. తమ కేసులు నెలల తరబడి లిస్టింగ్‌ చేయడం లేదనే భావన చాలామంది యువ న్యాయవాదుల్లో పెరుగుతోంద‌ని చెబుతున్నారు. కొందరు శక్తిమంతమైన లాయర్లు మాత్రం వారికి అనుకూలమైన స్లాట్‌ను, వేగంగా పొందుతున్నార‌ని ద‌వే అంటున్నారు. ఇటువంటి అంశాలు తప్పుడు సంకేతాలు పంపిస్తాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ దేశాన్ని, ప్రజలను ఓడించిన నలుగురు సీజేఐల తర్వాత వచ్చిన జస్టిస్‌ రమణ చాలా మెరుగ్గా వ్యవహరించార‌ని దుష్యంత్ దవే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.