Begin typing your search above and press return to search.

కడప స్టీల్‌ ప్లాంట్‌ పై జనసేన ముఖ్య నేత నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   14 Dec 2022 3:30 PM GMT
కడప స్టీల్‌ ప్లాంట్‌ పై జనసేన ముఖ్య నేత నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!
X
కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పై జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ ను మూడేళ్లలో ప్రారంభిస్తామని.. 25 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు మూడో కృష్ణుడిని తెచ్చారని విమర్శనాస్త్రాలు సంధించారు.

గతంలో స్టీల్‌ ప్లాంట్‌ కు జగన్‌ శంకుస్థాపన చేసినప్పుడు రాయలసీమలో వలసలు నివారిస్తామని వైఎస్‌ జగన్‌ పెద్ద పెద్ద మాటలు చెప్పారని నాదెండ్ల మనోహర్‌ ఎద్దేవా చేశారు. అయితే ఇప్పటివరకు స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ముందుకు వెళ్లలేదన్నారు. అలాగే పునాది రాయి కూడా పడలేదని గుర్తు చేశారు. తాజా కేబినెట్‌ మీటింగ్‌ లో మాత్రం కొత్త పరిశ్రమ తెచ్చినట్టు హడావుడి చేస్తున్నారని నాదెండ్ల మండిపడ్డారు.

కడప స్టీల్‌ ప్లాంటులో భాగంగా మొదట లిబర్టీ ఎస్సార్‌ స్టీల్స్‌ అనే కృష్ణుడు వచ్చాడని నాదెండ్ల మనోహర్‌ ఎద్దేవా చేశారు. రూ.17 వేల కోట్లు పెట్టుబడి పెడతామని లిబర్టీ ఎస్సార్‌ స్టీల్స్‌ చెప్పిందని గుర్తు చేశారు.

ఆ తర్వాత స్విట్జర్లాండ్‌ కు చెందిన మరో కృష్ణుడు వచ్చాడని, రూ.12 వేల కోట్లు పెట్టుబడి పెడతామన్నాడని నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. ఆయనా మొదటి కృష్ణుడిలానే పక్కకు తప్పుకున్నాడన్నారు.

ఇప్పుడు తాజాగా రూ.8 వేల కోట్లు పెడతామంటూ మూడో కృష్ణుడు జేఎస్‌ డబ్ల్యూ కంపెనీ రూపంలో వచ్చాడని నాదెండ్ల ఎద్దేవా చేశారు.

స్టీల్‌ ప్లాంట్‌ ఇంత మంది చేతులు మారడానికి, నిర్మాణంలో ఇంత జాప్యం జరగడానికి గల కారణాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలకు వివరించాలని నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

అలాగే కడప స్టీల్‌ ప్లాంటు కోసం కృష్ణపట్నం పోర్టులో ఒక బెర్తును కేటాయించారని.. ఆ బెర్తును ఎవరికి అమ్మేశారని ప్రభుత్వాన్ని నాదెండ్ల నిలదీశారు. దాని వెనుక జరిగిన జగన్నాటకాన్ని ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు.

రాయలసీమ ఆర్థిక, ఉద్యోగాల చరిత్రను మార్చడానికి కడపలో రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 30 లక్షల టన్నుల ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తున్నా అని 2019 డిసెంబర్‌ 23న సీఎం జగన్‌ శంకుస్థాపన సందర్బంగా సున్నపురాళ్లపల్లె వద్ద ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని మూడేళ్లలో పూర్తి చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే సీఎం జగన్‌ శంకుస్థాపన చేసి మూడేళ్లు అయినా ఇంతవరకు పునాది రాయి కూడా పడలేదు. తాజాగా జేఎస్‌ స్టీల్స్‌ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తోందని ఇటీవల కేబినెట్‌ సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ తీవ్ర విమర్శలు చేశారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.