Begin typing your search above and press return to search.

మహారాష్ట్రలో ప'వార్'... అజిత్‌ తిరుగుబాటుపై శరద్‌ కీలక వ్యాఖ్యలు!

By:  Tupaki Desk   |   3 July 2023 10:57 PM IST
మహారాష్ట్రలో పవార్... అజిత్‌ తిరుగుబాటుపై శరద్‌ కీలక వ్యాఖ్యలు!
X
మహరాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) పార్టీలో తిరుగుబాటు చెలరేగింది. ఇందులో భాగంగా... ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సోదరుడి కొడుకు, కీలక నేత అజిత్ పవార్... బీజేపీ - ఏక్ నాథ్ షిండే శివసేన ప్రభుత్వంలో చేరిపోయారు. అయితే ఈ విషయాలపై స్పందించిన శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మహారాష్ట్రలోని సతారాలో తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన సోదరుడి కుమారుడు అజిత్ పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బీజేపీ - ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిన ఒకరోజు తర్వాత ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీలను విచ్ఛిన్నం చేసే బీజేపీ వ్యూహాలకు కొంత మంది బలైపోయారని గుర్తుచేశారు. దీంతో పరోక్షంగా అజిత్ పవార్ వ్యవహారాన్ని ప్రస్థావించారని అంటున్నారు.

ఇదే సమయంలో బీజేపీపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన... మహారాష్ట్రతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల్లో కులం, మతం పేరుతో విభేదాలు సృష్టిస్తున్నారని అధికారంలో ఉన్న బీజేపీని ఉద్దేశించి పవార్ అన్నారు. నేడు మహారాష్ట్రతో పాటు దేశంలో కొన్ని వర్గాలు, కులం, మతం పేరుతో సమాజంలో చిచ్చు రేపుతున్నాయని అన్నారు.

ఇదే క్రమంలో... తన సోదరుడి కుమారుడు, అతని విధేయులు అంతర్గత తిరుగుబాటు గురించి చర్చించడానికి జూలై 6న పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు శరద్ పవార్ ప్రకటించారు. ఇదే సమయంలో అజిత్ పవార్, తదితరులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ముందు ఎన్సీపీ పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు.

ఈ సందర్భంలో పార్టీలో ఉన్న కార్యకర్తలకు, నాయకులకు గతాన్ని గుర్తు చేస్తూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేసిన శరద్ పవార్... ఇలాంటి పరిస్థితులు పార్టీకి కొత్త కాదని అన్నారు. 1980లో పార్టీ పెట్టిన సమయంలో 58 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే చివరకు 6 మంది మిగిలారని.. అయినా కూడా తాను పార్టీని బలపరిచానని అన్నారు. ఆ సమయంలో తర్వాత జరిగిన ఎన్నికల్లో పార్టీ మారిన వారంత తర్వాత ఓడిపోయారని శరద్ పవర్ గుర్తు చేశారు.

కాగా, ఓ వైపు బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల ఐక్యత కోసం శరద్ పవార్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఎన్సీపీలో చీలిక తీసుకువస్తూ అజిత్ పవార్... ఎనిమిదిమంది ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయిన సంగతి తెలిసిందే. ఫలితంగా ఆయనకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది!