Begin typing your search above and press return to search.

‘ది కేరళ స్టోరీ’.. అసలు వివాదం ఏంటి? నేతలు ఎందుకు స్పందిస్తున్నారు?

By:  Tupaki Desk   |   1 May 2023 11:00 PM GMT
‘ది కేరళ స్టోరీ’.. అసలు వివాదం ఏంటి? నేతలు ఎందుకు స్పందిస్తున్నారు?
X
‘కశ్మీర్ ఫైల్స్’.. కశ్మీర్ లోని పండింట్ల ఊచకోత ప్రధాన ఇతివృత్తంగా తెరకెక్కింది. బీజేపీ దీన్ని హైలెట్ చేసింది. ప్రచారం చేసుకుంది. ఇప్పుడు కేరళపై మరో కథ పడింది. కేరళ రాష్ట్రంలో తప్పిపోయిన అమ్మాయిలు వేలల్లో ఉన్నారు. దుబాయ్ షేక్ లకు అమ్ముడుపోయిన వారి కేసులు.. ఇక లవ్ జిహాద్ పేరిట మతం మార్చుకున్న కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. అలాంటి ఇతివృత్తాన్ని తీసుకొని కేరళలో తప్పిపోయిన అమ్మాయిలనే కథనే ‘ది కేరళ స్టోరీ’గా తీశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా విడుదల కానుంది. కానీ అప్పుడే ఈ సినిమాపై రాజకీయ పార్టీలు, నేతలు విమర్శల వాన కురిపిస్తున్నారు. సినిమాపై వివాదం మొదలైంది.

మే 5న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రంపై కేరళలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మతసామరస్యాన్ని దెబ్బ తీసే ఇటువంటి సినిమాను విడుదల చేయవద్దంటూ అధికార, పలు విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ సినిమాపై ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఘాటుగా స్పందించారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగాచిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి రాజకీయాలు కేరళలో పనిచేయవని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అసలు ‘ది కేరళ స్టోరీ’ సినిమా ఏంటి? వివాదం ఏంటన్నది తెలుసుకుందాం..

-‘ది కేరళ స్టోరీ’ కథేంటి?

కేరళల్లో కొన్నేళ్లలో 32 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ కథను రూపొందించి సినిమా తీశారు. దర్శకుడు సుదీప్తోసేన్ ‘ది కేరళ స్టోరీ’ పేరుతో తీసిన ఈ సినిమాలో ఓ నలుగురు యువతులు మతం మారి, ఉగ్రవాద శిక్షణ పొంది భారత్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్ర కార్యకలాపాల కోసం పనిచస్తున్నారనే కోణంలోనే చూపించడం వివాదానికి దారితీసింది. ఈ చిత్రానికి విపుల్ అమృత్ పాల్ షా నిర్మాతగా వ్యవహరించగా.. లీడ్ రోల్ లో ఆదాశర్మ నటించారు..

-సినిమా కథపై వివాదం

కేరళ రాష్ట్రానికి చెందిన 32,000 మంది బాలికలు తప్పిపోయారని, ఆ తర్వాత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌లో చేరారని సినిమా ట్రైలర్‌లో చూపించారు. అదా శర్మ నటించిన కేరళ స్టోరీ ఈ వివాదానికి కేంద్రబిందువైంది. మే 5న సినిమా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంపై కేరళ ప్రభుత్వం , ప్రతిపక్ష కాంగ్రెస్ నుండి చాలా వ్యతిరేకత ఎదుర్కొంటోంది.. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను నిషేధించాలని నాయకులు పిలుపునిచ్చారు. దర్శకుడు, నిర్మాత , నటులు సినిమాకు మద్దతు ఇచ్చారు, కేరళ కథ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటుందని.. ముస్లింలను కాదు అని వివరిస్తున్నారు. మొత్తం చిత్రంలో కేరళ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏమీ లేదని భరోసానిస్తున్నారు.

దర్శకుడు సుదీప్తో సేన్ మాట్లాడుతూ, "నెలల పాటు పరిశోధన చేసి ఈ చిత్రాన్ని నిర్మించాను. నిర్మాతలెవరూ ఈ చిత్రాన్ని వెనకేసుకురాలేదు. నా దృక్పథం మారిపోయింది, బాధితులతో మాట్లాడిన తర్వాత నేను చాలా చలించిపోయాను." అంటూ కథను మాత్రమే చూడాలని కోరారు.

ఇక కేరళ సీఎం విజయన్ ఈ సినిమా కేరళలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడానికి.. దేవాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే తీసినట్టుగా విమర్శించారు. ఈ చిత్రంను ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు కూడా వ్యతిరేకించారు. రాష్ట్రంలో విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కాంగ్రెస్, డీవైఎఫ్ఐ, ఐయూఎంఎల్ వంటి పార్టీలు డిమాండ్ చేశాయి.

‘సినిమాపై నిషేధం విధించాలని నేను కోరడం లేదు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను దుర్వినియోగం చేసినంత మాత్రాన అది విలువైనదిగా ఉండదు. అయితే ఇది మన వాస్తవికతను తప్పుగా చూపించడమేనని గట్టిగా స్పష్టంగా చెప్పే హక్కు కేరళీయులకు ఉంది.’ అంటూ కేంద్రమాజీ మంత్రి శశిథరూర్ ట్వీట్ చేశారు.

ది కేరళ స్టోరీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఏప్రిల్ 26న విడుదలైంది. అనంతరం దీనిపై వివాదం మొదలైంది. చివరకు ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి రావడంతో మే 5న విడుదలకు సిద్ధమైంది.