Begin typing your search above and press return to search.

విమానంలో పైలెట్ నడుమకు చుట్టుకున్న పాము.. ఏం చేశాడంటే?

By:  Tupaki Desk   |   8 April 2023 5:00 AM GMT
విమానంలో పైలెట్ నడుమకు చుట్టుకున్న పాము.. ఏం చేశాడంటే?
X
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోంది. విమానంలో ప్రయాణికులు ఉన్నారు. హఠాత్తుగా పైలెట్ సీటు వద్దకు వచ్చిన పాము అతడిని మెల్లిగా చుట్టుకుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా ఎగిరి గంతులేసి పరిగెడుతారు. కానీ అక్కడ స్థలం, సమయం రెండూ లేవు. పైలెట్ గుండె ఆగినంత పని అయ్యింది. ఇది ఏ హాలీవుడ్ సినిమాలోని థ్రిల్లింగ్ సన్నివేశమో కాదు.. నిజంగా జరిగిన ఘటన..

దక్షిణాఫ్రికా పైలట్ రుడోల్ఫ్ ఎరాస్మస్ కు ఇటువంటి పరిస్థితి ఎదురైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఆయన విమానాన్ని సేఫ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి నలుగురు ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోకుండా కాపాడగలిగారు. ఐదేళ్ల ఫ్లయింగ్ అనుభవం ఉన్న ఎరాస్మస్ గత సోమవారం ఉదయం వారెస్టర్ నుంచి నెట్ స్ఫ్రూట్ కు ప్రయాణికులతో ఒక విమానంలో బయలు దేరారు.

ఉదయం బయలుదేరడానికి ముందు విమానాన్ని చెక్ చేస్తుండగా.. ఆదివారం మధ్యాహ్నం విమానం రెక్క కింద ఒక పామును తాము చూశఆమని ఎయిర్ పీల్డ్ సిబ్బంది ఆయనకు చెప్పారు. దీంతో అందరూ కలిసి విమానం ఇంజిన్ భాగాన్ని విప్పి చూశారు. ఎక్కడా పాము జాడ కనిపించకపోవడంతో అది వెళ్లిపోయి ఉంటుందని వారంతా భావించారు. ఆ తర్వాత ఆయన విమానం స్టార్ట్ చేశారు.

విమానం బయలుదేరిన కొద్దినిమిషాల తర్వాత తన సీటు పక్కన ఏదో కదులుతున్నట్లు అనిపించింది. ఏమిటని ఎడమ వైపున కిందకు చూస్తే అక్కడో పాము కనిపించింది. అది ఆయన కదలికలను పసిగట్టి వెంటనే ఆయన సీటు కింద దాక్కుంది. ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పాలా? వద్దా? అని ఆలోచించారు. చెప్పడమే మంచిదని భావించి విమానంలో పాము ఉందని.. భయపడాల్సి లేదని.. కొద్ది నిమిషాల్లోనే విమానం కిందకు దిగుతుందని అందరికీ చెప్పాడు.

విమానం వెల్కోమ్ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో ఉంది. వెంటనే జోహన్నస్ బర్గ్ లోని కంట్రోల్ టవర్ కు ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి ఆయన సమాచారం అందించి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా దిగిపోయారు. పైలెట్ ఎరాస్మస్ దిగుతూ తన సీటును ముందుకు జరిపి చూడగా పాము చుట్టుకొని ఉంది. పాములు పట్టేవారిని రప్పించి చూడగా మల్లీ మాయమైంది.

తన నాలుగు దశాబ్ధాల అనుభవంలో ఇటువంటి సంఘటన గురించి ఎన్నడూ వినలేదని విమానయాన నిపుణుడు, దక్షిణాఫ్రికా ఎయిర్ షో నిర్వాహకులు తెలిపారు. పైలెట్ సమయస్ఫూర్తితో అద్భుతమైన నైపుణ్యంతో పరిస్థితిని ఎదుర్కొన్నాడని కొనియాడారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.