Begin typing your search above and press return to search.

జగన్ అడ్డాలో ఆదివారం అలాంటి మీటింగ్ జరిగిందట

By:  Tupaki Desk   |   5 Sept 2022 5:24 AM
జగన్ అడ్డాలో ఆదివారం అలాంటి మీటింగ్ జరిగిందట
X
అధికారంలో ఉన్నా లేకున్నా వైఎస్ కుటుంబానికి కంచుకోటలా నిలుస్తుంది కడప జిల్లా. వైఎస్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు అత్యంత విధేయ జిల్లాగా నిలిచేది. వైఎస్ సొంత జిల్లా అయిన కడపలో ఆయనకు.. ఆయన కుటుంబానికి తప్పించి మరెవరికీ ఇంతటి విధేయంగా జిల్లా ప్రజలు ఉండరనే చెప్పాలి.

మిగిలిన నేతలు ఎవరైనా సరే.. వైఎస్ కుటుంబ ఆశీస్సులు ఉంటే తప్పించి రాజకీయంగా ఎదగలేని పరిస్థితి. అలాంటి కంచుకోట లాంటి కడప జిల్లాలో ఇటీవల కాలంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాజాగా కడప నగరంలో జరిగిన ఒక మీటింగ్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసింది. జిల్లా కేంద్రమైన కడప నగరంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు పలువురు ఒక మీటింగ్ ను గుట్టుగా నిర్వహించారు. పార్టీకి తాము అత్యంత విధేయులమని చెప్పుకుంటూనే మరోవైపు వేరుగా సమావేశం నిర్వహించటంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

జగన్ సర్కారు అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు గడుస్తున్నా.. బలిజ నాయకులకు సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదన్న వాదన వారి నోటి వెంట వచ్చినట్లుగా చెబుతున్నారు. పార్టీలో తమకు సముచిత స్థానం దక్కటం లేదన్న అసంత్రప్తి వారి మాటల్లో వినిపిస్తోంది. నగర పాలక ఎన్నికలు మొదలు కొని నామినేటెడ్ పదవుల వరకు చూస్తే.. తమ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు.. గౌరవం లభించలేదన్న వేదన వారి మాటల్లో వినిపిస్తోంది.

పార్టీ అధికారంలోకి వచ్చే వరకు.. వచ్చిన తర్వాత కూడా తామంతా విధేయులుగా ఉన్నప్పటికీ.. తమను పక్కన పెట్టటం.. తమకు తగిన గౌరవం లేకపోవటంపై వారు అసహనానని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది

తమ వర్గీయులకు తగినంత ప్రాధాన్యత లభించేందుకు తామేం చేయాలన్న దానిపై వ్యహాన్ని సిద్ధం చేయటం కోసమే తాజా మీటింగ్ అన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ తరహా ఉదంతం వైసీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది. తన సొంత జిల్లాలో చోటు చేసుకున్న ఈ పరిణామంపై జగన్ ఏమేర ఫోకస్ చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.